గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 26 సెప్టెంబరు 2023 (08:54 IST)

నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ

supreme court
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో 18 రోజులుగా ఉంటున్నారు. అయితే, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా స్కిల్ స్కామ్‌లో తనపై నమోదు చేసిన కేసును కొట్టి వేయాలంటూ చంద్రబాబు తరపు న్యాయవాదులు స్పెషల్ లీవ్ పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిపై మంగళవారం విచారణ జరుగనుంది. 
 
తన పిటిషన్‌ను గత శుక్రవారం ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాస రెడ్డి కొట్టి వేయడాన్ని చంద్రబాబు సుప్రీంకోర్టులో శనివారం సవాల్ చేస్తూ ఎస్‌ఎల్పీని దాఖలు చేశారు. సోమవారం ఈ కేసును చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథా.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ముందు మెన్షన్ చేశారు. 
 
ఇందులో అత్యవసరత ఉన్నందున ఈ కేసుకు సంబంధించి మెన్షనింగ్ స్లిప్ ఇచ్చాం, పిటిషనర్ కస్టడీలో ఉన్నారు, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కేసు, అక్కడ ప్రతిపక్షాలను అణచివేస్తున్నారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. సీజేఐ స్పందిస్తూ రేపు (మంగళవారం) రండి అని సూచించారు. 
 
ఎప్పటి నుంచి చంద్రబాబు కస్టడీలో ఉన్నారని  ఈ సందర్బంగా ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. చంద్రబాబును ఈ నెల 8వ తేదీన అరెస్టు చేసినట్లు సిద్ధార్థ లూథ్రా చెప్పారు. సీజేఐ సెప్టెంబర్ 8 నుంచా అని ప్రశ్నిస్తూ రేపటి మెన్షనింగ్‌లో రండి.. ఏం చేయాలన్నది చూస్తాం అంటూ విచారణను ముగించారు.