మంగళవారం, 28 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 12 సెప్టెంబరు 2023 (10:44 IST)

డీకే అరుణకు షాక్.. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌కు ఊరట

supreme court
తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల నియోజకవర్గ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ ఇటీవల తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీంతో ఆయన శాసనసభ సభ్వత్వానికి ఎలాంటి ఢోకా లేకుండా పోయింది. 
 
గత ఎన్నికల సమయంలో కృష్ణమోహన్ సమర్పించిన అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ ఆయన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి డీకే అరుణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గత కొన్ని నెలలుగా విచారణ జరిపి... కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది.
 
ఈ తీర్పుపై కృష్ణమోహన్ రెడ్డి సుప్రీంకోర్టులో అప్పీల్ చేయగా, విచారించిన సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలంటూ ఎన్నికల సంఘానికి, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
 
కాగా, తెలంగాణ హైకోర్టు తీర్పు మేరకు ఇప్పటికే బీజేపీ నాయకురాలు డీకే అరుణను ఎమ్మెల్యేగా గుర్తిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ మేరకు గెజిట్ విడుదల చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలను ఇచ్చింది. కానీ కృష్ణమోహన్ రెడ్డి అప్పీలు వెళ్లారు. మరోవైపు కేసులో తన వాదనలు కూడా వినాలని డీకే ఆరుణ సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు.