ఆర్టీసీ బస్సునే చోరీ చేసిన ఘరానా దొంగ డ్రైవర్... ఎక్కడ?
ఓ ఘరానా దొంగ డ్రైవర్ ఏకంగా ఆర్టీసీ బస్సునే చోరీ చేశాడు. డ్రైవర్‌గా నటిస్తూ ఆర్టీసీ బస్సును మరో ప్రాంతానికి తీసుకెళ్లాడు. అందులో ఎక్కిన ప్రయాణికుల నుంచి వసూలు చేసిన డబ్బులతో ఉడాయించాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్ల జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
సిరిసిల్లా జిల్లాకు చెందిన స్వామి అనే వ్యక్తికి బస్సు ఉంది. దీన్ని ఆర్టీసీలో అద్దెకు నడిపిస్తున్నారు. ఆదివారం రాత్రి బస్సు డ్రైవర్ ఎంపీడీవో కార్యాలయం వద్ద దాన్ని పార్క్ చేసి తాళం వేయకుండానే వెళ్లిపోయారు. జిల్లాలోని గంభీరావు పేట మండలం శ్రీగాదకు చెందిన బందెల రాజు ఇదే అదునుగా భావించిన బస్సును (హైజాక్) దొంగిలించి డ్రైవ్ చేస్తూ వేములవాడకు బయలుదేరాడు.
మార్గమధ్యంలో కొందరు ప్రయాణికులను ఎక్కించుకుని వారి వద్ద టిక్కెట్ల పేరిట డబ్బులు కూడా వసూలు చేశాడు. టిక్కెట్లు మాత్రం తర్వాత ఇస్తానని అన్నాడు. ఆర్టీసీ బస్సు కావడంతో ప్రయాణికులు అతడి తీరును అనుమానించలేదు. ఈ లోపు సారంపల్లి - నేరెళ్ల మార్గంలో బస్సు తంగళపల్లి వద్ద ఆగిపోయింది. దీంతో, డీజిల్ అయిపోయిందని, తీసుకొస్తానని చెప్పిన దొంగ పరారయ్యాడు.
అటుగా వెళుతున్న ఇతర ఆర్టీసీ బస్సు డ్రైవర్లు రోడ్డు మీద ఆగున్న బస్సును గమనించి కంట్రోలర్ రూంకు సమాచారం అందించారు. ఈ విషయాన్ని కంట్రోలర్ బస్సు యజమానికి సమాచారం ఇవ్వగా ఆయన వెళ్లి బస్సును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం, సిద్దిపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీటీవీ కెమెరా ఫుటేజీ ఆధారంగా నిందితుడు రాజును గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.