సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , బుధవారం, 6 అక్టోబరు 2021 (14:57 IST)

అమరావతి రైతు ఉద్యమానికి రాహుల్ మ‌ద్ద‌తు... త్వ‌ర‌లో గుంటూరుకు రాక

వైఎస్ కుటుంబంపై మాజీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2004లో రాజశేఖర్ రెడ్డిని సీఎం చేయడంతోనే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగిందని వ్యాఖ్యానించారు. వైఎస్ సీఎం కాకపోతే...నేడు జగన్ సీఎం కాలేరన్నారు. వైసీపీ వలన కాంగ్రెస్ పార్టీకి ఎంతో నష్టం జరిగిందని, ఇపుడు రాజ‌కీయంగా తేరుకోలేని స్థితిలోకి కాంగ్రెస్ పార్టీ వెళ్లిపోయింద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 
 
ఇక ఏపీలో అమ‌రావ‌తి ఉద్య‌మానికి కాంగ్రెస్ బాస‌ట‌గా నిలుస్తుంద‌ని, త్వ‌ర‌లో కాంగ్రెస్ యువ‌నేత రాహుల్ గాంధీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు వ‌స్తార‌ని చింతా మోహ‌న్ తెలిపారు. విశాఖ, గుంటూరుకు త్వరలోనే రాహుల్ గాంధీ వస్తారని, స్టీల్ ప్లాంట్, అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతు పలుకుతారన్నారు. మూడు రాజధానులపై జగన్ ది తొందర పాటు చర్య అని, అఖిలపక్ష సమావేశం నిర్ణయం తీసుకోవాల్సిందని అన్నారు. రాహుల్ గాంధీ దేశానికి కాబోయే ప్రధాని అని చింతా మోహ‌న్ స్పష్టం చేశారు. త్వరలో ఏపీ పీసీసీలో మార్పులు ఉంటాయని, అయితే తాను పీసీసీ అధ్యక్ష రేసులో లేనని చింతా మోహన్ పేర్కొన్నారు.