సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 అక్టోబరు 2021 (14:21 IST)

బెట్టుదిగిన యూపీ సర్కారు - లఖీంపూర్ ఖైరీకు రాహుల్

ఉత్త‌ర‌ ప్ర‌దేశ్‌ రాష్ట్రంలోని లఖింపూర్ ఖేరీలో రైతుల‌పైకి కారును ఎక్కించిన ఘ‌ట‌నలోను, తదనంతర హింసలోనూ ప‌లువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాల‌ను ప‌రిశీలించేందుకు వెళ్లిన కాంగ్రెస్ నాయ‌కురాలు ప్రియాంకా గాంధీని పోలీసులు అరెస్టు చేసి గృహ నిర్బంధంలో ఉంచారు. 
 
మరోవైపు, కాంగ్రెస్ అగ్ర‌నేత‌ రాహుల్ గాంధీ నేతృత్వంలో ఢిల్లీ నుంచి యూపీకి కాంగ్రెస్ కీల‌క నేత‌ల బృందం బ‌య‌లుదేరింది. అయితే, వారితోపాటు.. అఖిలపక్ష పార్టీల నేతలు పర్యటించేందుకు అనుమతి ఇచ్చింది. కానీ, ఒక్కో పార్టీ నుంచి ఐదుగురు సభ్యలకు మించరాదన్న షరతు విధించింది. కాగా, ఈ కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటోన్న‌ కేంద్ర‌మంత్రి అజ‌య్ మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రాను పోలీసులు ఇప్ప‌టికీ అరెస్టు చేయ‌క‌పోవ‌డంపై ప్ర‌తిప‌క్షాలు భ‌గ్గుమంటున్నాయి.
 
మరోవైపు, లఖింపూర్ ఖేరిలో జరిగిన హింసాత్మక ఘటనపై ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. ఈ క్రమంలో లఖింపూర్‌లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పర్యటించాలని నిర్ణయించగా తొలుత ఆయన పర్యటనకు యూపీ సర్కారు అనుమతి ఇవ్వలేదు. దీనిపై రాహుల్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 
 
దేశంలో ప్ర‌స్తుతం నియంత పాల‌న న‌డుస్తోంద‌న్నారు. ప్ర‌భుత్వాలు రైతుల హ‌క్కుల్ని కాల‌రాస్తున్నాయ‌ని అన్నారు. ల‌ఖింపూర్ ఘ‌ట‌న‌లో కేంద్ర‌మంత్రి కొడుకును ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. 
 
కొత్త సాగు చట్టాలను తీసుకొచ్చి రైతుల వెన్ను విరిచిందని ఆరోపించారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తోన్న రైతులపై, వారికి మద్దతుగా నిలిచిన విపక్షాలపై మోడీ సర్కారు నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. 
 
రైతులపై హత్యలకు పాల్పడుతున్నారని, లఖింపూర్ ఖేరి ఘటనలో కేంద్రమంత్రి ఆయన కుమారుడి పేరు వస్తున్నా వారిపై కూడా చర్యలు తీసుకోలేదని విమర్శించారు. లక్నోలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోడీ కనీసం లఖింపూర్‌కి వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించలేదని రాహుల్ మండిపడ్డారు.
 
మరోవైపు లఖీంపూర్ హింసలో చనిపోయిన రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లే క్రమంలో సీతాపూ‌ర్‌లో అరెస్టయిన కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ గడిచిన రెండు రోజులుగా పోలీసుల నిర్బంధంలోనే ఉన్నారు. అనుమతి లభించేదాకా తాను సత్యాగ్రహం కొనసాగిస్తానని ప్రియాంక తెలిపారు.