బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 18 మార్చి 2020 (11:12 IST)

ఏపి భవన్‌లో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధ చర్యలు : రెసిడెంట్ కమిషనర్

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కట్టడిపై ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ భావన సక్సేనా నడుం బిగించారు. ఆంధ్రప్రదేశ్ భవన్‌ను సందర్శించే పర్యాటకులు, అతిధులు, అధికారికంగా నివాసం ఉంటున్న ఉద్యోగులు, స్వర్ణముఖి, గోదావరి, శబరి బ్లాకుల్లోని రూములలో తాత్కాలికంగా ఉండే అధికారులు, అతిథులు ఆందోళన చెందకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు రెసిడెంట్ కమిషనర్ భావన సక్సేనా తెలిపారు.
 
అందులో భాగంగా భవన్‌లోని రిసెప్షన్‌లో, రూములలో,  శానిటైజర్స్‌ను అందుబాటులో ఉంచినట్లు, భవన్ అధికారులు, సిబ్బందిని 24 x 7 అప్రమత్తంగా ఉండేటట్లు తగిన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. ఎపి భవన్ వైద్యుల సలహాలతో నివారణ చర్యలుచేపట్టారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ సోకకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై  కమిషనర్ భావన సక్సేనా భవన్ అధికారులతో కలిసి సూచనలు చేస్తున్నారు. 
 
ఇందులో భాగంగా కరోనా వైరస్ ఎంత ప్రమాదకారమో, ఎలా వ్యాప్తి చెందుతుందో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మొదలైనవాటిమీద అవగాహన సదస్సును నిర్వహించడానికి భవన్ వైద్యులతో త్వరలో సమావేశం నిర్వహించబోతున్నట్లు తెలిపారు. ఏపీ భవన్ పరిసరాల్లో ఎవరు కుడా వ్యాధి బారిన పడకుండా బహిరంగ ప్రదేశాల్లో శానిటేషన్, ఏపీ భవన్ కార్యాలయాలు, అతిథి రూములలో అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు. 
 
ఇందుకోసం ఏపి భవన్ హౌస్ కీపింగ్ నుంచి ప్రత్యేక బృందాన్ని అందుబాటులో ఉంచి ఎప్పటికప్పుడు లిఫ్టులు, రూములు, రైలింగ్స్ మొదలైనవాటిని ఎప్పటికప్పుడు శానిటైజర్స్‌తో శుభ్రపరుస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ భవన్‌లోని క్యాంటీన్ కాంట్రాక్టర్‌కు అతిథుల కొరకు కరోనాపై తీసుకోవలసిన జాగ్రత్తలపై తగిన ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, వారి సిబ్బందిని తగుజాగ్రత్తలతో మసులుకోవాలని తెలిపినట్లు చెప్పారు. 
 
ఏపీ భవన్ పరిసరాల్లో కరోనా అవగాహన కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రదర్శన బోర్డులు ఉంచడం జరిగిందని, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఏపీ భవన్ అధికారులు కరోనాపై వైద్య సదుపాయాలకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన అత్యవసర నెంబర్ల సమాచారం కూడా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
 
అంతేకాకుండా ఏపీ భవన్ అధికారులు, సిబ్బంది మాస్కులు ధరించి అప్రమత్తతతో కూడిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. భవన్‌లోని ఆడిటోరియం, సమావేశమందిరం మొదలైనవాటిని తదుపరి ఆదేశాలు అందుకోనేంతవరకు తాత్కాలికంగా మూసివేయడం జరిగిందని ఎపి భవన్ రెసిడెంట్ కమిషనర్ భావన సక్సేనా తెలిపారు.