శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఎం
Last Updated : బుధవారం, 18 మార్చి 2020 (09:07 IST)

కరోనా రోగిపై అసత్య ప్రచారం : భువనగిరిలో ముగ్గురి అరెస్టు

కరోనాపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన ప్రభుత్వం ఆ దిశగా రంగంలోకి దిగింది. తొలిసారి భువనగిరిలో ముగ్గురిని అరెస్టు చేసి.. వాళ్ల సెల్‌ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కరోనాతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పేషెంట్ ఇతడే అంటూ ఓ ఫొటోను మార్ఫింగ్ చేసి వాట్సాప్‌లో సర్క్యూలేట్ చేశారు. ఇది భువనగిరి పోలీసుల దృష్టికి రావడంతో వాట్సాప్ గ్రూప్‌లోపోస్ట్ చేసిన వ్యక్తి సహా ఆ గ్రూప్ అడ్మిన్, దాన్ని ఇతరులకు పంపిన గ్రూప్ మెంబర్‌ను అరెస్టు చేశారు.
 
గాంధీలో పేషెంట్ చనిపోయాడంటూ ప్రచారం 
భువనగిరికి చెందిన జూపల్లి భరత్ అనే వ్యక్తి ఓ ఫేక్ ఫొటోను క్రియేట్ చేశాడు. ఆస్పత్రి బెడ్‌పై ఉన్న ఓ వ్యక్తి ఫొటోను గూగుల్‌లో నుంచి డౌన్‌లోడ్ చేసి.. ఎడిట్ చేశాడు. ఆ ఫొటోలోని వ్యక్తి గాంధీ ఆస్పత్రిలో కరోనాతో చికిత్స పొందుతూ మరణించాడని, ఆ డెడ్ బాడీని భువనగిరికి తరలించారని చెబుతూ ఓ వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేశాడు. 
 
దానిని అదే గ్రూప్‌లో ఉన్న బాలరాజు అనే వ్యక్తి మరికొందరికి షేర్ చేశాడు. ఆ ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి.. ప్రజలను భయబ్రాంతులను చేసే ప్రయత్నం చేసిన భరత్, బాలరాజు సహా ఆ గ్రూప్ అడ్మిన్ మర్రి శివకుమార్‌లను అరెస్టు చేశామని సోమవారం తెలిపారు పోలీసులు.
 
ఎవరూ చనిపోలేదు....
‘రాష్ట్రంలో కరోనా బారినపడి ఎవరూ మరణించలేదు. వైరస్‌ను కంట్రోల్ చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ప్రజలను భయపెట్టేలా ఎవరూ అసత్య వార్తలను ప్రచారం చేయొద్దు. సోషల్ మీడియాలో ఇలాంటి ఫేక్ న్యూస్‌లు పోస్ట్ చేస్తే ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్-1897 సెక్షన్ 3 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం’ అని పోలీసులు హెచ్చరించారు.