1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఎం
Last Updated : బుధవారం, 18 మార్చి 2020 (09:08 IST)

కరోనా కల్లోలం : ప్రేమ మందిర సందర్శన నిలిపివేత...

దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ట చర్యలు చేపట్టాయి. కరోనా వ్యాప్తిని కట్టడి చేయాలన్న ఉద్ధేశంతో మార్చి 31 వరకు దేశంలోని పాఠశాలలు, యూనివర్సిటీలతో సహా థియేటర్లు, వ్యాయామ శాలలు మూసివేయాలని కేంద్ర వైద్యారోగ్యశాఖ సోమవారం రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు జారీ చేసిన విషయం తెలిసిందే. 
 
తాజాగా కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు తాజ్‌ మహల్‌ సందర్శనను నిలిపివేస్తున్నట్లు కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ ప్రకటించింది. ఈ మేరకు ‘కరోనా వ్యాప్తి దృష్ట్యా టిక్కెట్లు ద్వారా ప్రవేశించే అన్ని చారిత్రక కట్టడాలు, అన్ని స్మారక చిహ్నాలు, కేంద్ర మ్యూజియాలను, ఎర్రకోట, తాజ్‌ మహాల్‌ మార్చి 31 వరకు మూసివేస్తున్నాం. దీనిని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం’ అని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్‌ పటేల్‌ ప్రకటించారు. 
 
వీటితోపాటు దేశంలోని పలు దేవాలయాల్లో భక్తుల రాకపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి. మహారాష్ట్రలోని షిరిడి, మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయం కూడా మార్చి 31 వరకు మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా తాజ్‌ మహల్‌ మూతపడటం ఇది మూడోసారి. మొదటి సారి 971లో పాకిస్తాన్‌తో యుద్ధ సమయంలో.. అలాగే 1978లో వరదల నేపథ్యంలో రెండో సారి కొన్ని రోజుల పాటు సందర్శనను నిలిపి వేశారు.