గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 18 జులై 2020 (20:22 IST)

కష్టాలు ప్రజలకు మిగిల్చి వరాలు కార్పొరేట్లకిస్తారా?‌: సీపీఐ

కరోనా విపత్కర కాలంలో కష్టాలను పేద ప్రజలకు మిగిల్చి, వరాలను కార్పొరేట్ శక్తులకు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిపట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తీవ్రం ఆగ్రహం వ్యక్తంచేశారు.

శ‌నివారం విజయవాడ నుండి వీడియో కాన్ఫరెన్సు ద్వారా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల సిపిఐ కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశంలో పాల్గొన్న కె.రామకృష్ణ మాట్లాడుతూ.. కరోనా లాక్‌డౌన్ కాలాన్ని కేంద్రంలో మోదీ ప్రభుత్వం తమకు అనుకూలంగా మలచుకుందని విమర్శించారు.

పెట్రోల్, డీజిల్ ధరలను ఇబ్బడిముబ్బడిగా 20 రోజులపాటు ప్రతిరోజూ పెంచారన్నారు. ఎన్నడూ లేని విధంగా పెట్రోల్ కన్నా డీజిల్ ధర పైకి ఎగబాకిందన్నారు. కేవలం ఆదాయం సమకూర్చుకునే దానిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందని, పెట్రో ధరల భారం రూ.2 లక్షల కోట్లు అదనపు ఆదాయం కేంద్రానికి లభించనుందన్నారు.

కరోనా మహమ్మారితో దేశం అల్లకల్లోలమవుతుంటే పేదలకు ఆహార, ఆర్థిక భరోసా కల్పించాల్సిన నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా రోజుల పాటు రూ.20 లక్షల కోట్లు ఆత్మనిర్భర్ ప్యాకేజీని ప్రకటించారు. కరోనా కాలంలో ముఖేష్ అంబానీ అస్తులు పై పైకి ఎగబాకింది, ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితాలో ముఖేష్ అంబానీ రోజురోజుకీ ముందుకెళ్తున్నాడన్నారు.

దేశంలో వలస కార్మికులు, పేద రైతులు, వ్యవసాయ కూలీలు, పేదవర్గాలు దయనీయ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. ఎపీలో అప్రజాస్వామిక పాలన సాగుతోందన్నారు. కేవలం నవరత్నాల పథకాల అందుకే ప్రయత్నించడమే తప్ప రాష్ట్రంలో సాధించిన అభివృద్ధి ఏదీలేదన్నారు. పారిశ్రామిక, వ్యవసాయ, నీటిపారుదల, గ్రామీణాభివృద్ధి వంటి కీలకరంగాల్లో అభివృద్ధి శూన్యమన్నారు.

ఉద్యోగుల జీతాలకు, పథకాలకు మాత్రమే గత 13 నెలల కాలంలో 42% అప్పులు తెచ్చిన ఘనత జగన్మోహనరెడ్డికే దక్కుతుందన్నారు. ఆ అప్పులు కాక విదేశాల్లో ఉండే ట్రస్టుల నుండి అప్పులు తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మురం చేశారన్నారు. రాష్ట్రంలో అప్పులు పెరిగి అభివృద్ధి కుంటుపడిందనీ, వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారన్నారు. కోర్టులను ధిక్కరిస్తూ, జడ్జిలను అవమానపరిచే పద్ధతుల్లో నియంతృత్వ పాలన చేస్తున్నారని దుయ్యబట్టారు.

అమరావతి రాజధాని నిర్మాణానికి ఇప్పటికే రు.9 వేల కోట్లు ఖర్చు చేశారనీ, మరో రు,3 వేల కోట్లు వెచ్చిస్తే రాజధాని పూర్తవుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి 3 రాజధానులంటూ పగ సాధించే విధంగా చర్యలు చేపట్టడం దుర్మార్గమన్నారు. 

పేదలకు ఇళ్లస్థలాల కోసం సేకరించే భూమిని పలు ప్రాంతాల్లో అధిక ధరలకు కొనుగోలు చేయాలని అధికారులపై ప్రజాప్రతినిధులు ఒత్తిడి పెంచుతున్నారన్నారు. అలాగే గత టిడిపి ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేపట్టిన 6 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించకుండా ప్రస్తుత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం నిలిపివేయాలని తప్పుబట్టారు.

ప్రజల, ప్రభుత్వ సొమ్ముతో నిర్మించిన ఇళ్లను ప్రజలకు కేటాయించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేమిటో ప్రశ్నించారు. ఈ నెల 25 నుండి గ్రామీణ ప్రాంతాలలో సిపిఐ చేపట్టే పల్లెబాట కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రజలలో మానసిక స్థైర్యం కలిగించేందుకు కమ్యూనిస్టు పార్టీ చేపట్టిన కార్యక్రమాన్ని ప్రజలు ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.

వీడియో కాన్ఫరెన్సులో రామకృష్ణతో పాటు సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జల్లి విల్సన్, రావుల వెంకయ్య, పి.హరనాధరెడ్డి, జి.ఓబులేసు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కెవివి ప్రసాద్, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ కార్యదర్శి టి.మధు, డేగా ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.