మీకు 45 మంది సలహాదారులా? 25మందికి క్యాబినేట్ హోదానా?
ప్రభుత్వ సలహాదారుల వ్యవస్థపై ఎమ్మెల్సీ అశోక్ బాబు మండిపడ్డారు. ప్రజలకు పనికిరాని ఈ వ్యవస్థ వల్ల రాష్ట్ర ఖజానాకు గండిపడుతోందని విమర్శించారు. ప్రభుత్వ సలహాదారుల వ్యవస్థ అసలు ఎవరికి ఉపయోగపడుతుందో సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పాలని అశోక్ బాబు డిమాండు చేశారు.
సలహాదారుల వ్యవస్థే పనికిరాని, పనికిమాలిన వ్యవస్థని హైకోర్టు అభిప్రాయపడిందన్నారు. ఏ అర్హత, అనుభవం ఉన్నాయని జగన్ ప్రభుత్వం 45మందిని సలహాదారులుగా నియమించింది? అని ప్రశ్నించారు. వారిలో 25 మందికి కేబినెట్ హోదా కూడా ఎలా ఇచ్చారని పేర్కొన్నారు.
ప్రభుత్వానికి మంచి సలహాలు ఇవ్వాల్సిన సలహాదారులు... రాజకీయ వ్యాఖ్యలు చేస్తే, ప్రతిపక్షాలకు సమాధానాలు ఇస్తున్నారని ఆయన పరోక్షంగా సజ్జల రామకృష్ణా రెడ్డిని ప్రస్తావించారు. అసలు వారు ప్రభుత్వానికి సలహాలు ఇవ్వకుండా, మీడియా ముందుకు వచ్చి... ప్రతిపక్షాలపై విరుచుకుపడటం ఏంటని ప్రశ్నించారు వీరు ప్రజలకు నీతులు చెప్పే స్థాయికి ఎదిగారని విమర్శించారు.