శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 18 ఫిబ్రవరి 2021 (07:19 IST)

ఊపందుకున్న షర్మిల కొత్త పార్టీ స్థాపన చర్యలు... సలహాదారుల నియామకం

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ కుమార్తె వైఎస్ షర్మిల కొత్త పార్టీ స్థాపన చర్యలు ఊపందుకున్నాయి. ఆమె రాజకీయ అరంగేట్రం చేసి తెలంగాణాలో కొత్త పార్టీని స్థాపించనున్నారు. ఇందుకోసం ఆమె తన కార్యకలాపాలను వేగిరం చేశారు. ఇందులోభాగంగా, ఇప్పటికే ఆమె తెలంగాణాకు చెందిన వైఎస్ఆర్ అభిమానులతో జిల్లాల వారీగా ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులోభాగంగా, పలువురు నేతలు ఆమెను కలిశారు. 
 
ఈ క్రమంలో మరోవైపు పార్టీ సలహాదారులుగా మాజీ ఐఏఎస్ అధికారి ప్రభాకర్ రెడ్డి, మాజీ ఐపీఎస్ అధికారి ఉదయసిన్హాలను నియమించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో సీఎంవోలో అడిషనల్ సెక్రటరీగా ప్రభాకర్ రెడ్డి పని చేయగా, సీఎస్ఓగా ఉదయసిన్హా పని చేశారు. వీరికి మంచి పాలనా అనుభవంవుంది. 
 
అలాగే, ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ బ్రదర్ షఫీ కూడా షర్మిల పార్టీలో చేరారు. పార్టీ నేతలు, కార్యకర్తలను తన ఉత్తేజపూరిత ప్రసంగాలతో ఆయన మోటివేట్ చేయనున్నట్టు సమాచారం. ఇంకోవైపు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య షర్మిలను కలిసి, ఆమెకు మద్దతు పలికారు.
 
తాజాగా మరో ఆసక్తికర అంశం వెలుగులోకి వస్తోంది. తెలంగాణలో ఆంధ్రవాళ్ల పార్టీలు ఎందుకని పలువురు నేతలు ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. పోరాడి సాధించుకున్న తెలంగాణలో మళ్లీ ఆంధ్రోళ్ల పెత్తనం ఎందుకని అంటున్నారు. 
 
ఈ నేపథ్యంలో, తాను 'తెలంగాణ కోడలు' అని ప్రకటించేందుకు షర్మిల సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ఇంటి కోడలిగా తాను తెలంగాణకే చెందుతానని చెపుతూ ఆమె ప్రజల్లోకి వెళ్లనున్నట్టు సమాచారం.