సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?
ప్రముఖ హీరోయిన్ సమంత సోమవారం సినీ దర్శకుడు రాజ్ నిడుమోరును రెండో వివాహం చేసుకున్నారు. కోయంబత్తూరులోని ఈషా కేంద్రంలో ఉన్న లింగ భైరవి ఆలయంలో అత్యంత నిరాడంబరంగా వీరి వివాహ వేడుక జరిగింది. తమ పెళ్లి ఫోటోలను వారు ఇన్‌స్టాలో వెల్లడించారు. ఈ పెళ్లి వేడుకకు కేవలం 30 మంది అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరైనట్లు సమాచారం.
రాజ్ నిడిమోరు (50) ప్రముఖ దర్శకుడు, రచయిత, నిర్మాత. తన స్నేహితుడు కృష్ణ డీకేతో కలిసి 'రాజ్ అండ్ డీకే' పేరుతో ఇండస్ట్రీలో ఎంతో గుర్తింపు పొందారు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో 1975లో పుట్టిన రాజ్... ఎస్వీయూ కాలేజీలో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఆ తర్వాత అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా స్థిరపడ్డారు. సినిమాపై ఆసక్తితో ఉద్యోగాన్ని వదిలి, కృష్ణ డీకేతో కలిసి సినీ ప్రయాణం ప్రారంభించారు. 'గో గోవా గాన్', 'స్త్రీ', 'ది ఫ్యామీలీ మ్యాన్', 'ఫర్జీ' వంటి విజయవంతమైన ప్రాజెక్టులతో దేశవ్యాప్తంగా పేరు సంపాదించారు. మీడియా అంచనాల ప్రకారం, రాజ్ నిడిమోరు ఆస్తి విలువ సుమారు రూ.83-85 కోట్లు. ఇక సమంత ఆస్తి విలువ రూ.100-110 కోట్ల మధ్య ఉంటుందని అంచనా.
సమంత (38)కు, రాజ్ నిడిమోరుకు ఇద్దరికీ ఇది రెండో వివాహం కావడం గమనార్హం. నటుడు నాగచైతన్యతో 2017లో వివాహం చేసుకున్న సమంత, 2021లో విడాకులు తీసుకున్నారు. మరోవైపు, రాజ్ నిడిమోరు తన మొదటి భార్య శ్యామలికి 2022లో విడాకులు ఇచ్చారు.
కాగా, రాజ్ పెళ్లి వార్తలు బయటకు రాగానే ఆయన మాజీ భార్య "నిస్సహాయ స్థితిలో ఉన్నవారు నిస్సహాయమైన పనులే చేస్తారు" అంటూ సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ కొత్త జంటకు అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.