శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (20:05 IST)

ఏపీలో 11న డ్వాక్రా అక్కచెల్లెమ్మల పండుగ

రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గల స్వయం సహాయక సంఘాల్లోని 78,27,693 మంది అక్కచెల్లెమ్మల ఉజ్వల భవిష్యత్ కోసం రూపొందించిన వైఎస్సార్ ఆసరా పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెప్టెంబర్ 11 న లాంఛనంగా ప్రారంభిస్తారని సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్, ఎక్స్- అఫీషియో స్పెషల్ సెక్రటరీ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

అక్కచెల్లెమ్మలు 7,91,257 స్వయం సహాయక సంఘాల ద్వారా బ్యాంకుల నుంచి  తీసుకున్న రూ.25,383.49 కోట్ల రుణాలను మాఫీ చేయడంలో భాగంగా తొలి విడతగా సెప్టెంబర్ 11 న రూ. 6,345.87 కోట్లు వారి ఖాతాల్లో జమ చేయనున్నారని తెలిపారు. ఇందులో ఎస్సీలు 21.70 %, ఎస్టీలు 3.78 %, బీసీలు 47.95 %, ఈబీసీలు 15.02 % ఇతరులు 11.55%   ఉన్నారన్నారు.

స్వయం సహాయక సంఘాల మహిళలను గ్రామ, వార్డు సచివాలయాలకు ఆరోజు ఆహ్వానించి పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలు పడుతున్న ఆర్థిక  ఇబ్బందులను “ప్రజా సంకల్పయాత్ర” లో  చూసి చలించిపోయిన గౌరవ ముఖ్యమంత్రి వారి ఉజ్యల భవిష్యత్ కోసం “వైఎస్సార్ ఆసరా” పథకాన్ని   నవరత్నాలలో భాగంగా చేసి ప్రభుత్వ ప్రధాన కార్యక్రమంగా ప్రస్తుతం తీసుకురావడం జరిగిందన్నారు.

ఈ పథకం వల్ల మహిళా సాధికారత మరింత మెరుగై, గ్రామీణ,పట్టణ ప్రాంతాలలో స్వయం సహాయక సంఘాలకు చెందిన పేద మహిళలు ఆర్ధికంగా పురోగతి చెందుతారన్నారు. వాణిజ్య మరియు సహకార బ్యాంకులలో ఏప్రిల్ 11, 2019 నాటికి ఋణం తీసుకొని బకాయిలు ఉన్న అన్ని మహిళా స్వయం సహాయక సంఘాలు ఈ పథకానికి అర్హులన్నారు. 

ఏప్రిల్ 11, 2019 నాటికి అక్కచెల్లమ్మలు పొదుపు సంఘాల ద్వారా తీసుకున్న బ్యాంకు రుణాల బకాయిల మొత్తాన్ని4 దఫాలుగా, నేరుగా వారి సంఘాల పొదపు ఖాతాలకు జమ చేయడానికి ప్రభుత్వం  నిర్ణయించిందన్నారు. వైఎస్సార్ ఆసరా క్రింద 4 విడతలుగా ఇవ్వబోవు బకాయిల మొతాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసి, ఈబిసి, కాపు, మైనారిటీ, క్రిస్టియన్ కార్పొరేషన్ల ద్వారా ఇవ్వడం జరుగుతుందన్నారు.

రాష్ట్రంలోని  పొదుపు సంఘాల్లో ఉన్న అక్కచెల్లెమ్మల అప్పు నిల్వ మొత్తం   రూ. 25,383.49  కోట్లు  నాలుగేళ్లలో నేరుగా వారి సంఘాల ఖాతాలకు జమ చేయడం జరుగుతుందన్నారు. ఈ ఏడాది ఇప్పటికే వైఎస్సార్ చేయూత ద్వారా 23 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేద అక్కచెల్లెమ్మలకు దాదాపు రూ. 4,312.5 కోట్లు అందించడం జరిగిందన్నారు.

స్వయం సహాయక సంఘాల అక్క చెల్లెమ్మలకు వడ్డీ భారం లేకుండా ఇప్పటికే రూ.1400 కోట్లు అక్క చెల్లెమ్మల తరుపున ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించిందన్నారు. ఇకపై కూడా ప్రతి ఏటా  వడ్డీ మొత్తం రూ.1400 కోట్లు ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లిస్తుందన్నారు.

రూ.14,204 కోట్ల డ్వాక్రా రుణాలను, గత ప్రభుత్వం మాఫీ చేస్తానని నమ్మబలికి డ్వాక్రా సంఘాలను అప్పుల పాలు చేసారన్నారు. తత్ఫలితంగా సుమారు 18.36 % డ్వాక్రా సంఘాలు నిరర్ధక ఆస్తులుగా మిగిలిపోగా, చాలా సంఘాలు నిర్వీర్యమైపోగా, సుమారు రూ. 3,036 కోట్ల వడ్డీని అక్కచెల్లెమ్మలే బ్యాంకులకు అపరాదపు వడ్డీతో సహా చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు.

కానీ, జగనన్న అలాకాకుండా ఎన్నికల రోజు వరకు అక్కచెల్లెమ్మలకు ఉన్న పొదుపు సంఘాల రుణాల మొత్తం సొమ్మును 4 దఫాలుగా ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. అయితే వారు యదావిధిగా రుణాలు చెల్లించుకుంటూ ఉండాలని ఆనాడే చెప్పడం జరిగిందన్నారు. ఆమాటకనుగుణంగా అక్క చెల్లెమ్మలు ఈ రోజు నాటికి 99.27% రుణాల చెల్లింపును యదావిధిగా కొనసాగించటంతో, ప్రస్తుతం ఎన్పీఏ లు కేవలం 0.73 శాతం మాత్రమే ఉన్నాయన్నారు.