శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 5 సెప్టెంబరు 2020 (21:39 IST)

జగనన్న మద్యం వ్యాపార పథకం అమల్లోకి తెచ్చాడు: వంగలపూడి అనిత

పాదయాత్ర సమయంలో మద్యపాన నిషేధం అమలుచేస్తానని చెప్పిన జగన్, అధికారంలోకి వచ్చాక జగనన్న మద్యం వ్యాపార పథకాన్నితెచ్చి, అక్కాచెల్లెళ్ల గొంతులు కోశాడని టీడీపీ మహిళానేత, తెలుగుమహిళ విభాగం రాష్ట్రఅధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆమె తన నివాసం నుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే క్లుప్తంగా..

దశలవారీ మద్యపాన నిషేధంలో భాగంగా ధరలు పెంచామని ముఖ్యమంత్రి సహా, వైసీపీ నేతలంతా సమర్థించుకుంటున్నారు. వారేం చెప్పేదల్లా నమ్మడానికి ప్రజలేమీ మూర్ఖులు కారు. కరోనా సమయంలో మద్యం లేకపోయినా ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. ఆదాయం కోసం ఎప్పుడైతే  ప్రభుత్వం మద్యం దుకాణాలు తెరిచిందో అప్పటి నుంచే కరోనా వ్యాప్తి ఎక్కువైంది.

మద్యంవిషయంలో ప్రభుత్వవిధానం పారదర్శకమైతే, కొత్తగా తీసుకొచ్చిన మద్యం పాలసీపై శ్వేతపత్రం విడుదల చేయాలి. పాలకులు నిజంగా మద్యపాన నిషేధం చేసేవారయితే, కొత్త డిస్టిలరీలకు అనుమతులు ఎందుకు ఇస్తున్నారు? ప్రభుత్వం చెప్పిందల్లా నమ్మడానికి ప్రజలేమీ వైసీపీ కార్యకర్తలు కారు. మద్యపాన నిషేధంలో భాగంగా గతంలో ధరలు పెంచామని చెప్పినవారు, ఇప్పుడెందుకు తగ్గించారు?

జనాలను విచ్చలవిడిగా తాగించి, పచ్చి తాగుబోతులను చేయడానికే మద్యం ధరలు తగ్గించారు. హైకోర్టు పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకోవచ్చని చెప్పడం కూడా ధరలు తగ్గించడానికి ఒక కారణం. అన్ని అంశాలపై కోర్టుల చుట్టూ తిరుగుతూ విచ్చలవిడిగా ప్రజాధనాన్ని వృథా చేస్తున్న  ప్రభుత్వం, మద్యం ఆదేశాలపై హైకోర్టుఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళుతుందా?

గత ప్రభుత్వంలో మద్యం సీసాలు పగులగొట్టి, ఓవర్ యాక్షన్ చేసిన ఏపీఐఐసీ ఛైర్మన్, మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ ఇప్పుడేం చెబుతారు? వ్యాపారం చేయడంలో జగన్‌ను మించినవారు లేరు. ప్రజల ప్రాణాలతో కూడా వ్యాపారం చేయడం ఆయనకే సాధ్యమైంది. ప్రభుత్వం కొత్తగా పథకాలు ప్రకటించినప్పుడు మద్యం దుకాణాల వద్ద రద్దీ కనిపిస్తుంది.

అమ్మఒడి, వాహనమిత్ర, జగనన్న చేయూత పథకాలపై వచ్చే సొమ్మంతా  మద్యం దుకాణాల ద్వారా తిరిగి ప్రభుత్వ ఖజానాకే చేరుతోంది. ఈ విధంగా మద్యం అమ్మకాలను జగన్ ప్రభుత్వం గొలుసుకట్టు వ్యాపారంలా మార్చింది. వాలంటీర్లు కుక్కర్లలో నాటుసారా తయారుచేస్తూ సరికొత్త వ్యాపారం చేస్తున్నారు. ఆర్థిక నేరాల్లో ఆరితేరిన వారికే ఇటువంటి కుట్రపూరిత ఆలోచనలు వస్తాయి. ప్రభుత్వచర్యలను చూస్తున్న ప్రజలు కోపంతో రగిలిపోతున్నారు.

కరోనా కాబట్టి వైసీపీ నేతలు ప్రశాంతంగా తిరగగలుగుతున్నారు. లేకపోతే ఈపాటికే మంత్రులు, ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టేవారు. 5 కోట్ల మంది ప్రజలుంటే , 40, 50 లక్షల మందికి పథకాలపేరుతో చిల్లర ఇస్తే, మిగిలిన వారి సంగతేంటి? వైసీపీ ప్రభుత్వం పెట్టిన దిక్కుమాలిన పథకాల వల్ల చదువుకున్నవారు కూడా రోజు కూలీలుగా మారారు. ఉపాధ్యాయ దినోత్సవం నాడు రాష్ట్రంలో ఎంతమంది ఉపాధ్యాయులు సంతోషంగా జీవిస్తున్నారో చెప్పగలరా?

ప్రైవేట్ ఉపాధ్యాయులు ఉపాధి కోల్పోయి, రోడ్డునపడ్డారు. దేశంలో ఎక్కడాలేని విధంగా.. ఈ రాష్ట్రంలోనే తెచ్చామన్న దిక్కుమాలిన దిశ చట్టం ఏమైంది. టీడీపీ ఎమ్మెల్యే భవాని తనని దూషించిన వైసీపీ పేటీఎమ్ బ్యాచ్ పైన ఇచ్చిన ఫిర్యాదుని ఏంచేశారు? నిజాలు మాట్లాడేవారు ఎంతమంది ఉంటే, అంతమందిని లారీలతో తొక్కిస్తారా? జగన్ అమ్ముతున్న దిక్కుమాలిన మద్యం బ్రాండ్లు తాగి ప్రాణాలు పోగోట్టుకోలేకనే ప్రజలు పొరుగు రాష్ట్రాలకు వెళుతున్నారు.

కొడాలి నాని భాష, భావవ్య క్తీకరణ, బాడీ లాంగ్వేజ్ ప్రజాప్రతినిధి ప్రవర్తనలా లేదు. నాని అంటే తనకు గతంలో చాలా గౌరవం ఉండేది. కానీ ఇప్పుడు ఆయన తీరు చూస్తుంటే రాష్ట్రప్రజలంతా సిగ్గుపడాల్సిన పరిస్థితి. ఆయనలాంటి వ్యక్తులు, చంద్రబాబుని, దేవినేని ఉమాని, అచ్చెన్నాయుడిని అన్నంత మాత్రాన వారిస్థాయి ఏమీ తగ్గదు. అటువంటి వారిని దూషించడం ద్వారా నాని తనస్థాయిని తానే దిగజార్చుకుంటున్నాడు.

నాని భాష మంత్రిస్థాయిలో ఉండాలని ఒక సోదరిలా కోరుతున్నాను. రాష్ట్ర ప్రజలు నాయకులను చూసి, సిగ్గుపడే పరిస్థితిని కల్పించకూడదు. వైసీపీ నేతలకు దమ్ముంటే, మద్యంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టులో సవాల్ చేయాలి. నాటుసారా, శానిటైజర్ తాగి మరింతమంది చనిపోకముందే, ముఖ్యమంత్రి తన మద్యం వ్యాపారంపై పునరాలోచనచేయాలి.