తిరుమలలో ఎలక్ట్రిక్ బస్సులు, ఎలక్ట్రిక్ కార్లు
తిరుమలలో పర్యావరణాన్ని కాపాడేందుకు ఎలక్ట్రిక్ బస్సులు, ఎలక్ట్రిక్ కార్లు ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి తెలిపారు. టిటిడి ధర్మకర్తల మండలి తొలి సమావేశం సోమవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగింది. సమావేశం అనంతరం వైవి.సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ...
"ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉన్న పలు అంశాలపై చర్చించి పాలనకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నాం. తిరుమలలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు బాలాజి రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించాం. ఇందుకోసం అంచనాలను రూపొందించి వచ్చే సమావేశంలో ఆమోదిస్తాం.
అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణ వ్యయాన్ని రూ.36 కోట్లకు తగ్గించి ఒక ప్రాకారంతో ఆలయ నిర్మాణం చేపట్టాలని నిర్ణయం. తిరుపతిలోని అవిలాలకు సంబంధించి తిరుపతివాసులకు ఉపయోగకరంగా ఉండేలా చెరువు, పార్కు మాత్రమే నిర్మించాలని నిర్ణయం.
తిరుమలలో పర్యావరణాన్ని కాపాడేందుకు ఎలక్ట్రిక్ బస్సులు, ఎలక్ట్రిక్ కార్లు ప్రవేశపెట్టాలని నిర్ణయం. టిటిడిలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులపై సమస్యలపై చర్చించేందుకు సబ్ కమిటీ ఏర్పాటుకు నిర్ణయం. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించిన అనంతరం గరుడ వారధి నిర్మాణానికి నిధుల కేటాయింపుపై నిర్ణయం" అని వివరించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఎం.పద్మ, తుడ ఛైర్మన్ మరియు ఎక్స్ అఫిషియో సభ్యుడు డా. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు యువి.రమణమూర్తి రాజు, మేడా మల్లికార్జునరెడ్డి, కె.పార్థసారథి, మురళీకృష్ణ, ఎన్.శ్రీనివాసన్, జె.రామేశ్వరరావు, డా.ఎం.నిచిత, ఎన్.సుబ్బారావు, జి.వెంకటభాస్కర్‌రావు, బి.పార్థసారథిరెడ్డి, డి.దామోదర్‌రావు, ఎంఎస్.శివశంకరన్, కుమారగురు, సి.ప్రసాద్‌కుమార్, మోరంశెట్టి రాములు, పి.ప్రతాప్ రెడ్డి, కె.శివకుమార్, తిరుమల ప్రత్యేకాధికారి ఎవి.ధర్మారెడ్డి, తిరుపతి జెఈవో పి.బసంత్‌కుమార్, సివిఎస్వో గోపినాథ్ జెట్టి తదితరులు పాల్గొన్నారు.