మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 10 మార్చి 2021 (16:19 IST)

ఏపీ మున్సిపల్ పోల్స్ : మంత్రి ఆళ్ళ నాని ఓటు గల్లంతు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బుధవారం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆరోగ్య శాఖామంత్రి ఆళ్ళ నాని ఓటు గల్లంతు అయింది. ఈ విషయం తెలుసుకున్న మంత్రి ఎన్నికల సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ఈ ఎన్నికల్లో భాగంగా, మంత్రి ఆళ్ళ నాని తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఏలూరులోని శనివరపుపేటలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి రాగా, ఓటర్ల జాబితాలో తన పేరు లేదని తెలుసుకుని ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా తయారీలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఆరోపించారు. 
 
దీంతో పోలింగ్ బూత్ సిబ్బంది క్షుణ్ణంగా 20 నిమిషాల పాటు తనిఖీ చేయగా, ఆయన ఓటరు నంబరుపై ఓ మహిళ పేరు నమోదైవున్నట్టు గుర్తించారు. దీంతో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకోకుండానే వెనుదిరిగారు. 
 
కాగా, ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్‌కు పోలింగ్ నిర్వహించాలని మంగళవారం హైకోర్టు ఆదేశించిన విషయం తెల్సిందే. అయితే, ఎన్నికలు నిర్వహించినప్పటికీ... ఫలితాలను మాత్రం తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు వెల్లడించవద్దని ఆదేశించింది.