ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 19 సెప్టెంబరు 2024 (11:47 IST)

వైకాపాకు తగలనున్న షాక్.. జనసేన వైపు సామినేని ఉదయభాను!

samineni udayabhanu
వైకాపాకు వరుస షాకులు తగులుతున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా చిత్తు చిత్తుగా ఓడిపోయింది. ఈ ఓటమిని వైకాపా నేతలు ఏమాత్రం జీర్ణించుకోలేక పోయారు. వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఖరిని నచ్చని ఇంకొందరు నేతలు పార్టీని వీడుతున్నారు. ఏకంగా జగన్ సమీప బంధువులు సైతం ఆ పార్టీ నుంచి తప్పుకుంటున్నారు. తాజగా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వైకాపాను వీడేందుకు సిద్ధమైనట్టు సమాచారం. తన అనుచర వర్గంతో కలిసి జనసేనలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్టు ప్రచారం సాగుతుంది. తన నిర్ణయంపై వారం రోజుల్లో క్లారిటీ ఇవ్వనున్నారు.
 
ఆయన రాకను స్వాగతిస్తూ జనసేన శ్రేణులు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు కూడా పెడుతున్నాయి. తాజాగా బాలినేని రాజీనామా తరహాలోనే ఉదయభాను కూడా ముందు వైకాపాకు రాజీనామా చేసి జనసేన జెండాను భుజానికి ఎత్తుకునేలా కార్యాచరణను రూపొందిస్తున్నారని సమాచారం. ఇందుకు సంబంధించి ఇప్పటికే తమ పార్టీ అగ్రనాయకత్వంతో సంప్రదింపులు పూర్తయినట్టు జనసేనలోని కొందరు ముఖ్యనేతలు చెబుతున్నారు. 
 
కాంగ్రెస్, వైకాపాల్లో సీనియర్‌ నాయకుడిగా, మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ప్రభుత్వ విప్‌గా ప్రాతినిధ్యం వహించిన ఉదయభానుకు సముచిత స్థానం ఇచ్చేలా జనసేన నాయకత్వం నుంచి హామీ లభించిందంటున్నారు. కొద్ది రోజులుగా ఆయన స్థానికంగా అందుబాటులో లేకపోవడానికి కూడా పార్టీ మార్పు విషయంలో జరుగుతున్న సంప్రదింపులే కారణమని తెలుస్తోంది.