సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 13 సెప్టెంబరు 2024 (14:58 IST)

పవన్ అంటే గుర్తొచ్చేవి సేవ, సాయం.. అదే జగన్ అంటే గుర్తొచ్చేవి ఏవంటే..?

Alla Hari
Alla Hari
వైకాపా నేతలపై గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి నిప్పులు చెరిగారు. జనసేనాని పవన్ కల్యాణ్‌ని విమర్శించే నైతక అర్హత వైసీపీ నేతలకు లేదని మండిపడ్డారు. ప్రజలు ఆపదలో ఉన్నారని తెలిస్తే ఆదుకునేందుకు అరక్షణం కూడా ఆలోచించకుండా సాయపడే మనిషి పవన్ అని.. సహాయక చర్యలకు ఆటంకం కలగకూడదనే పరామర్శకు వెళ్ళలేదని చెప్పారు. 
 
అధికారంలో ఉన్నప్పుడు  హెలికాప్టర్ తప్ప భూమి మీద నడవని జగన్‌కు ఇప్పుడు ప్రజలు గుర్తుకొస్తున్నారని ఎద్దేవా చేశారు. వరద బాధితులకు సొంత డబ్బు ఆరు కోట్ల రూపాయల సాయం చేసిన అపర దానకర్ణుడు జనసేనాని పవన్ అని కొనియాడారు. పవన్ అంటే గుర్తొచ్చేవి సేవ, సాయం... అదే జగన్ అంటే జ్ఞాపకానికి వచ్చేవి దోపిడీలు , హత్యలు, దాష్టీకాలు అంటూ ఆళ్ళ హరి నిప్పులు చెరిగారు.
 
పవన్ కల్యాణ్ కుటుంబం మొత్తం దానాలకు ప్రతీకలైతే ... జగన్ కుటుంబం దారుణాలకు , దుర్మార్గాలకు నిలువెత్తు సాక్ష్యాలు అని విమర్శించారు. రైతుల్ని పరామర్శించటానికి పొలాల్లో స్టేజీ కట్టించిన పనికిమాలిన నేత ప్రపంచంలో ఎవరన్నా ఉన్నారు అంటే అది జగనేనని ఆళ్ళ హరి అన్నారు. 
 
కూటమి నేతలు వరద బాధితుల సహాయక చర్యల్లో తలమునకలై ఉంటే.. బెయిల్ కోసం వైకాపా నాయకులు హైకోర్టు, సుప్రీంకోర్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని.. పిల్లికి బిచ్చం పెట్టని లోభిలు , మనసు, మానవత్వం లేని పాపాత్ములంతా వైకాపాలోనే ఉన్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ కల్యాణ్ చేసిన గుప్త దానాల గురించి ప్రచారం చేస్తే వైకాపా నేతలకు కాస్తన్నా పాప విమోచన లభిస్తుందని ఆళ్ళ హరి సెటైర్లు విసిరారు.