సోమవారం, 4 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 10 సెప్టెంబరు 2024 (12:16 IST)

అరెస్టు నుంచి తప్పించునేందుకు అవినాశ్ పడరాని పాట్లు..!!

supreme court
మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడికి పాల్పడిన కేసులోని నిందితుల్లో ఒకడైన వైకాపా నేత దేవినేని అవినాశ్ ఇపుడు ఈ కేసులో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, అక్కడ చుక్కెదురైంది. దీంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయి, ఇపుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరుగనుంది. 
 
కాగా, గత వైకాపా ప్రభుత్వ పాలనపై నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని అనేక మంది వైకాపా నేతలు రెచ్చిపోయారు. ఇందులోభాగంగా, టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి చేశారు. ఈ దాడి కేసు ఇపుడు వైకాపా నేతల మెడకు చుట్టుకుంది. ఇదే కేసులో ఇటీవల మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్టయ్యారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అనినాశ్ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. 
 
అవినాశ్ ఇప్పటికే ఓ సారి దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే, ఆయనను హైదరాబాద్ విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకున్నారు. ఆ తర్వాత హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించగా, చుక్కెదురైంది. ఈ నేపథ్యంలో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌పై కోర్టు మంగళవారం విచారించనుంది. దీంతో అందరి దృష్టి సుప్రీంకోర్టు తీర్పుపై నెలకొంది. సుప్రీంకోర్టు కూడా ముందస్తు బెయిల్ ఇవ్వకుంటే ఈ కేసులో దేవినేని అవినాశ్ అరెస్టు ఖాయంగా తెలుస్తుంది.