ఆదివారం, 3 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 5 సెప్టెంబరు 2024 (11:00 IST)

ముఖ్యమంత్రులు రాజులేం కాదు.. సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు

supreme court
రాష్ట్రాల ముఖ్యమంత్రులు సామంత రాజులేం కాదంటూ సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీని మందలించింది. రాష్ట్ర అటవీ శాఖ మంత్రి, కీలక అధికారుల అభిప్రాయాలను పట్టించుకోకుండా ఏకపక్ష ధోరణితో రాజాజీ టైగర్ రిజర్వ్ డైరెక్టరుగా ఒక ఐఎఫ్ఎస్ అధికారిని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీని నియమించారు. ఆయనను సుప్రీంకోర్టు గట్టిగా హెచ్చరించింది. 
 
ప్రభుత్వాధినేతలైన ముఖ్యమంత్రులు తమనుతాము పూర్వకాలంలో రాజులు మాదిరిగా భావించుకోవద్దని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. మనం భూస్వామ్య యుగంలో లేమని, ముఖ్యమంత్రి అయినంత మాత్రనా ఏమైనా చేయగలరా? అని న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, పీకే మిశ్రా, కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది.
 
మన దేశంలో జన విశ్వాస సిద్ధాంతం లాంటిది ఉందని, కార్యనిర్వాహక అధిపతులుగా ఉన్న సీఎం పాత రోజుల్లో రాజుల మాదిరిగా వ్యవహరించకూడదని పేర్కొంది. బాధ్యతలు అప్పగించిన ఐఎఫ్ఎస్ అధికారిపై శాఖాపరమైన విచారణ పెండింగులో ఉందని, అలాంటి అధికారిపై ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రేమ ఎందుకని బెంచ్ ప్రశ్నించింది.
 
డెస్క్ ఆఫీసర్, డిప్యూటీ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, మంత్రి ఇంతమంది అభిప్రాయాలతో ముఖ్యమంత్రి విభేదిస్తున్నారంటే కారణం ఉండే ఉంటుందని, ఆయన మనసులో వేరే దరఖాస్తు ఉండొచ్చని, అందుకే ఆయన విభేదిస్తున్నారేమోనని కోర్టు వ్యాఖ్యానించింది. కాగా సెప్టెంబర్ 3న సదరు అధికారి నియామక ఉత్తర్వులను ఉపసంహరించుకున్నట్టు ధర్మాసనానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం తెలిపింది.
 
కాగా సీఎం పుష్కర్ ధామీ నియమించిన సీనియర్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి రాహుల్‌పై క్రమశిక్షణా చర్యలు ప్రస్తుతం పెండింగులో ఉన్నాయి. ఆయనను రాజాజీ టైగర్ రిజర్వ్ అధికారిగా నియమించకూడదని నోట్లో పేర్కొన్నప్పటికీ ముఖ్యమంత్రి లెక్కచేయలేదు. దీంతో ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రులేం రాజులు కాదంటూ సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది.