గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 19 ఆగస్టు 2024 (15:08 IST)

కోల్‌కతా మెడికో హత్యాచారం కేసు : సుమోటాగా స్వీకరించిన సుప్రీం.. 20న విచారణ

supreme court
కోల్‌కతాలోని ఆర్జీ కర్ వైద్య కళాశాల ఆసుపత్రిలో రాత్రిపూట విధుల్లో ఉన్న ఉన్న ట్రెయినీ మహిళా వైద్యురాలిపై హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ కేసులో దోషులను కఠినంగా శిక్షించాలంటూ వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో ఈ నెల 20వ తేదీ మంగళవారం విచారణ చేపట్టనుంది. 
 
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవీ చంద్రచూడ్ సారథ్యంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారణ జరపనుందని సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌‍‌లో పేర్కొన్నారు. ఈ బెంచ్‌లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో పాటు, జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా కూడా ఉన్నారు.
 
కాగా, కోల్‍‌కతా హత్యాచార ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించాలంటూ సీజేఐ డీవై చంద్రచూడ్‌‌ను ఉద్దేశించి మోనికా సింగ్ అనే వైద్యురాలు ఓ లేఖలో విజ్ఞప్తి చేశారు. తక్షణమే నిష్పాక్షిక దర్యాప్తు జరిగేలా ఆదేశాలు జారీ చేయాలని ఆమె అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. 
 
బెంగాల్ ముఖ్యమంత్రి మమతాపై నమ్మకం పోయింది.. మెడికో తండ్రి.. 
 
వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై నమ్మకం పోయిందని, ఒక ఆడబిడ్డగా తండ్రిగా తన కుమార్తెను హత్యాచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పదేపదే విజ్ఞప్తి చేసినా ఆమె పెద్దగా స్పందించలేదని, న్యాయం చేసేందుకు ఆమె పెద్దగా ప్రయత్నాలు చేయలేదని మృతురాలి తండ్రి బోరున విలపిస్తూ చెప్పుకొచ్చారు.
 
కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ అండ్ హాస్పిటల్‌లో జూనియర్ మహిళా వైద్యురాలిపై హత్యాచారం జరిగింది. ఆ తర్వాత జరుగుతున్న పరిణామాల పట్ల మృతురాలి తల్లిదండ్రులు తీవ్రంగా కలత చెందుతున్నారు. మృతురాలి తండ్రి మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై నమ్మకం పోయిందని అన్నారు.
 
'ఇంతకుముందు మమతా బెనర్జీపై ఎంతో నమ్మకం ఉండేది. ఇప్పుడా భావన పోయింది. ఆమె కూడా న్యాయం చేయాలని అడుగుతున్నారు. కానీ ఆ దిశగా ఆమె చేస్తున్నది ఏమీ లేదు. ఓవైపు ఆమె న్యాయం కావాలి అంటూనే... న్యాయం కావాలి అని నినదిస్తున్న సాధారణ ప్రజలను నిర్బంధిస్తున్నారు. ఆమె ఎందుకిలా చేస్తున్నారో అర్థం కావడంలేదు. 
 
ఈ హత్యాచార ఘటనలో సీసీటీవీ ఫుటేజి ప్రకారం సంజయ్ రాయ్‌ని అరెస్టు చేశారు. కానీ ఒక్కడి వల్ల ఈ ఘాతుకం జరిగి ఉండదని, ఇందులో ఇతరులు కూడా ఉండొచ్చని అందరూ అంటున్నారు. మేం మొదటి నుంచి ఇదే చెబుతున్నాం' అని వ్యాఖ్యానించారు.