శనివారం, 2 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 8 ఆగస్టు 2024 (11:15 IST)

జగన్ అక్రమాస్తుల కేసు : సీబీఐ అఫిడవిట్లలో పస లేదంటూ... సుప్రీంకోర్టు అసహనం..

supreme court
వైకాపా అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ముఖ్యంగా, కేంద్ర దర్యాప్తు సంస్థ కోర్టులో దాఖలు చేస్తున్న అఫిడవిట్లలో ఏమాత్రం పస (సమాచారం)లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పైగా, కోర్టు ఆదేశాల్లోనే తప్పులు ఉన్నట్టుగా ఈ అఫిడవిట్లను దాఖలు చేస్తుందంటూ వ్యాఖ్యానించింది. 
 
జగన్ అక్రమాస్తుల కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ మాజీ ఎంపీ, ప్రస్తుత టీడీపీ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గత కొంతకాలంగా విచారణ జరుగుతుంది. ఇందులోభాగంగా బుధవారం కూడా విచారణ జరిగింది. జస్టిస్ సంజయ్ ఖన్నా, జస్టిస్ సంజీవ్ కుమార్, జస్టిస్ ఆర్.మహదేవన్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. విచారణ కోసం వరుసగా దాఖలవుతున్న దరఖాస్తులపై జస్టిస్ ఖన్నా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇతరత్రా విషయాల్లోకి వెళ్లకుండా, దరఖాస్తులతో సంబంధం లేకుండా విచారణ మొదలు పెట్టాలని ఆదేశించారు.
 
అంతకుముందు రఘురామరాజు తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ జగన్ అక్రమాస్తుల కేసులో ఎలాంటి పురోగతి లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్లోని 12వ పేరా చూస్తే దిగ్భ్రాంతికి గురవుతారని తెలిపారు. దీనికి జస్టిస్ ఖన్నా స్పందిస్తూ సీబీఐ నివేదికను తాను కూడా చూశానని, బాధ కలిగించిందని పేర్కొన్నారు.
 
జగన్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ ఈ కేసులో 900 మంది సాక్షులు, లక్షల పేజీల ఫైళ్లు ఉన్నాయని పేర్కొన్నారు. దీనికి జస్టిస్ ఖన్నా స్పందిస్తూ.. విచారణలో ఇలాంటివన్నీ సర్వసాధారణమేనని, ఈ కేసు కోసమే సీబీఐ ప్రత్యేక న్యాయవాదిని ఏర్పాటు చేసి ముందుకెళ్లాలని సూచించారు. కేసు విచారణ జాప్యానికి కారణాలు చెప్పవద్దని, మెరిట్స్లోలోకి వెళ్లాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అనంతరం కేసును నవంబర్కు ప్రారంభమయ్యే వారానికి విచారణను వాయిదా వేశారు.