ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 5 ఆగస్టు 2024 (11:31 IST)

పలువురు గవర్నర్లు తీరు వివాదాస్పదం : సుప్రంకోర్టు జడ్జి విమర్శలు!!

supreme court
ప్రస్తుతం భారతీయ జనతా పార్టీయేతర పాలిత రాష్ట్రాల్లో గవర్నర్లు వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదమవుతుంది. దీంతో ఆయా ప్రభుత్వాలకు పెద్ద తలనొప్పిగా మారింది. అసెంబ్లీ పాస్ చేసిన పలు కీలక బిల్లులను అక్కడి గవర్నర్‌లు ఆమోదించకపోవడం వివాదాస్పదమవుతుంది. ఈ క్రమంలో గవర్నర్‌ల తీరుపై అక్కడి ప్రభుత్వాలు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నాయి. 
 
ఇటీవల కేరళ, పశ్చిమ బెంగాల్, రాష్ట్రాలు తమ గవర్నర్‌లు చాలా నెలలుగా బిల్లులకు ఆమోదం తెలపడం లేదంటూ సుప్రీంకోర్టులో పిటిషన్‌లు దాఖలు చేయగా, విచారణకు స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. గతంలో తెలంగాణ, పంజాబ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల గవర్నర్‌లు బిల్లులపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారని సుప్రీంకోర్టు విమర్శించింది. 
 
ముఖ్యమంత్రి సిఫార్సు చేసినా మంత్రి పదవి ఇవ్వడానికి నిరాకరించినందుకు తమిళనాడు గవర్నర్‌పై కూడా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం, రాజ్‌నెలకొన్న ఈ వివాదాలు ఓ పక్క చర్చనీయాంశంగా మారిన తరుణంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న గవర్నర్‌ల వ్యవస్థపై మరోసారి కీలక కామెంట్స్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 
 
తాజాగా బెంగళూరులో జరిగిన ఎన్ఎల్ఎస్ఐయూ - పీఏసీటీ సదస్సులో పాల్గొన్న జస్టిస్ నాగరత్న పలు కీలక అంశాలపై మాట్లాడారు. గవర్నర్ల తటస్థత గురించి నాటి రాజ్యాంగ సభ చర్చలలో జి.దుర్గాబాయి చేసిన వ్యాఖ్యలను జస్టిస్ నాగరత్న గుర్తు చేస్తూ.. గవర్నర్‌లను పార్టీ రాజకీయాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ఉంచడమే పాలకవర్గం బాధ్యత అని అన్నారు. పార్టీ వ్యవహారాలకు లోబడి గవర్నర్ వ్యవస్థ ఉండకూడదన్నారు. 
 
గవర్నర్ల అంశంపై సుప్రీంకోర్టులో నడుస్తున్న కేసులు విచారకరమన్నారు. జస్టిస్ నాగరత్న గతంలోనూ గవర్నర్ల తీరును ఆక్షేపిస్తూ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఈ యేడాది మార్చి నెలలో నల్సార్ యూనివర్శిటీలో పాల్గొన్న ఓ కార్యక్రమంలోనూ ఇలాంటి కామెంట్స్ చేశారు. ఇప్పుడు మరో మారు జస్టిస్ నాగరత్న .. గవర్నర్ల వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకున్న విషయం తెల్సిందే.