ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 22 జులై 2024 (09:34 IST)

4 వేల టన్నుల చెత్త ఉన్న ఇంటిలో నివసిస్తున్న తల్లీ కుమార్తెలు.. ఎందుకని.. ఎక్కడ?

garbage
తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు జిల్లాలో ఓ దిగ్భ్రాంతికర ఘటన ఒకటి వెలుగుచూసింది. తల్లీకుమార్తెలు ఇద్దరూ 4 వేల టన్నుల చెత్త ఉన్న ఇంటిలో నివసిస్తూ వచ్చారు. ఈ విస్తుగొలిపే ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, కోయంబత్తూరులోని ఓ అపార్టుమెంటులో రుక్మిణి అనే మహిళ, ఆమె భర్త, కుమార్తె నివసించేవారు. రుక్మిణి భర్త ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్ అయ్యారు. భర్త మరణించడంతో రుక్మిణి, కుమార్తె మాత్రమే ఆ ఇంట్లో ఉంటున్నారు. 
 
భర్త మరణించిన తర్వాత బంధువులు ఎవరూ రాలేదు. దాంతో మానసికంగా కుంగిపోయిన రుక్మిణి, ఆమె కుమార్తె ఇంటి నుంచి బయటికి రావడం మానేశారు. భర్త మరణించడంతో రుక్మిణికి పెన్షన్ వచ్చేది. అదే వారికి ఆధారం. ప్రతిరోజు ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసి తెప్పించుకునేవారు. ఎప్పుడో ఒకసారి వంట చేసుకునేవారు. అయితే, వ్యర్థాలను పారేయకుండా అలాగే వదిలేయడంతో ఇల్లంతా చెత్త మయం అయిపోయింది. ఇంటిని శుభ్రపరిచేవారు కాదు. దాంతో, దాదాపు 4 టన్నుల చెత్త ఇంటి నిండా పేరుకుపోయింది.
 
అయితే, ఇరుగుపొరుగు వారు ఈ విషయాన్ని గుర్తించి ఓ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులకు ఈ విషయాన్ని తెలియజేశారు. ఎంతో ప్రయత్నించిన మీదట రుక్మిణి ఇంట్లోకి స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు ప్రవేశించగలిగారు. ఒక్కసారిగా తట్టుకోలేనంత తీవ్ర దుర్గంధంతో వారు ఉక్కిరిబిక్కిరయ్యారు. డంపింగ్ యార్డులా కనిపిస్తున్న ఆ ఇంటిని చూసి నివ్వెరపోయారు.
 
ఆ ఇంటి లోపలి దృశ్యాలను ఫోనులో వీడియో రికార్డ్ చేసిన స్వచ్ఛంద సంస్థ వారు, ఆ విజువల్స్‌ను మున్సిపల్ అధికారులకు పంపించారు. దాంతో, స్పందించిన మున్సిపల్ అధికారులు తమ సిబ్బందిని పంపించి, రుక్మిణి ఇంట్లోని 4 వేల కిలోల చెత్తను బయటికి తరలించి, ఇంటిని శుభ్రం చేయించారు.