ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్

స్థల వివాదం : పోలీస్ స్టేషన్‌ బయట తల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించి కుమారుడు.. ఎక్కడ?

Woman Fire
ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో ఘోరం జరిగింది. ఓ స్థల వివాదం కారణంగా కన్నబిడ్డ కిరాతక చర్యకు పాల్పడ్డాడు. పోలీసు స్టేషన్‌ బయట కన్నతల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీన్ని గమనించిన పోలీసులు ఆ మహిళ ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించారు. అయితే, తీవ్రంగా గాయపడిన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సీసీటీవీలో రికార్డైన ఈ ఘటన అలీఘర్‌లోని ఖైర్ పోలీస్ స్టేషన్‌లో మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో జరిగింది.
 
పోలీసులు వెల్లడించిన కథనం మేరకు.. ఓ స్థలం విషయంపై తల్లి హేమలత, కొడుకు గౌరవ్‌ల మధ్య గత కొంతకాలంగా వివాదం నడుస్తుంది. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు గౌరవ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని పరిష్కరించుకునేందుకు వారిద్దరూ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ఈ క్రమంలో బయటకు వెళ్లిన మహిళ తిరిగి వస్తుండగా బయటే నిలబడివున్న కుమారుడు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. 
 
ఆమెకు ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ మహిళ తాళలేక గిలగిలా కొట్టుకుంది. మరోవైపు, కుమారుడు అత్యంత క్రూరంగా ప్రవర్తించాడు. ఒకవైపు కన్నతల్లి మంటల్లో కాలిపోతుంటే తన మొబైల్‌లో వీడియోను రికార్డు చేశాడు. మంటలు ఒక్కసారిగా ఎగిసిపడటంతో క్షణకాలం వెనకడుగు వేసిన పోలీసులు.. ఆ తర్వాత ఆమెను రక్షించి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
 
అయితే, అప్పటికే ఆమెకు 40 శాతం కాలిన గాయాలు కావడంతో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ఆమెను కాపాడే ప్రయత్నంలో ఒకరిద్దరూ పోలీసులు కూడా గాయాలపాలయ్యారు. ఈ కిరాతక చర్యకు పాల్పడిన గౌరవ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.