మహిళలను ప్రత్యేక కేటగిరీగా చూడాలి.. అందుకే కవితకు బెయిల్ ఇస్తున్నాం : సుప్రీంకోర్టు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కె.కవితకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా.. పీఎంఎల్ఎ చట్టంలోని సెక్షన్ 45(1)లోని నిబంధనలను అనుసరించి ఇలాంటి కేసుల్లో మహిళలను ప్రత్యేక కేటగిరీగా చూడాలని ధర్మాసనం స్పష్టంచేసింది. చదువుకున్న, ఉన్నత స్థానాల్లో ఉన్న మహిళలు దుర్బల విభాగంలోకిరారని, అలాంటి వారిని సెక్షన్ 45(1) కింద పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును తప్పుపట్టింది.
కవిత బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ ఆ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేస్తున్నట్లు ప్రకటించింది. ట్రయల్ కోర్టులో పాస్‌పోర్టు అప్పగించాలని, ఒక్కో కేసులో రూ.10 లక్షల చొప్పున పూచీకత్తు సమర్పించాలని, సాక్షులను ప్రభావితం చేయడం, సాక్ష్యాలను ధ్వంసం చేయడం వంటి చర్యలకు పాల్పడవద్దని, అవసరమైనప్పుడల్లా ట్రయల్ కోర్టు ఎదుట హాజరుకావాలనే షరతులు విధిస్తూ తీహార్ జైలు నుంచి ఆమె విడుదలకు ఆదేశాలు ఇచ్చింది.
మంగళవారం బెయిల్ పిటిషన్‌పై విచారణ ప్రారంభమవగా.. కవిత తరపున దామా శేషాద్రినాయుడు, విక్రమ్ చౌదరిలతో కలిసి సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గీ వాదనలు వినిపించారు. ఈ కేసులో కవిత పాత్రను నిరూపించే ఆధారాలేవీ లేవన్నారు. 'ఈడీ కేసులో ఇప్పటికే విచారణ పూర్తయింది. సీబీఐ కేసులో అభియోగపత్రం దాఖలు చేశారు. ఈ రెండు కేసుల్లో దర్యాప్తు పూర్తయినందున ఆమె కస్టడీని కొనసాగించాల్సిన అవసరం లేదంటూ వాదనలు వినిపించారు.