ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 27 ఆగస్టు 2024 (16:27 IST)

కవితకు బెయిల్ ఇప్పించిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు : బండి సంజయ్

bandi sanjay
భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బెయిల్ ఇప్పించిన కాంగ్రెస్ పార్టీకి అభినందలు అంటూ కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత బండి సంజయ్ అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితకు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసిన విషయం తెల్సిందే. దీనిపై బండి సంజయ్ కామెంట్స్ చేశారు. 
 
కవితకు బెయిల్ లభించినందుకు కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ న్యాయవాదులకు అభినందనలు తెలిపారు. మీ అలుపెరగని ప్రయత్నాలు చివరకు ఫలించాయంటూ చురక అంటించారు. ఈ బెయిల్ భారాస, కాంగ్రెస్ రెండు పార్టీల విజయమని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ మహిళా నేత బెయిల్‌పై బయటకు వచ్చారని, ఇక కాంగ్రెస్ వ్యక్తి రాజ్యసభకు వెళతారంటూ వ్యాఖ్యానించారు. కవితకు బెయిల్ కోసం వాదనలు వినిపించిన కాంగ్రెస్ అభ్యర్థిని ఏకగ్రీవంగా రాజ్యసభకు నామినేట్ చేయడానికి కేసీఆర్ అద్భుతమైన రాజకీయ చతురత ప్రదర్శించారని అన్నారు. 
 
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితకు బెయిల్...
 
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో భారాస ఎమ్మెల్సీ కె.కవితకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసులో కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై దాదాపు గంటన్నర పాటు వాదనలు సాగాయి. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథన్‌లతో కూడిన బెంచ్ కవితకు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఇప్పటికే ఛార్జిషీటు దాఖలు చేసిన నేపథ్యంలో నిందితురాలు జైలులో ఉండాల్సిన అవసరం లేదని బెంచ్ వ్యాఖ్యానించింది. 
 
ఈడీ, సీబీఐ.. రెండు కేసుల్లోనూ ఆమెకు బెయిల్ ఇచ్చింది. నిందితురాలు మహిళ అనే విషయం కూడా దృష్టిలో ఉంచుకుని బెయిల్ ఇస్తున్నట్లు పేర్కొంది. దీంతో ఐదు నెలలుగా తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత మంగళవారం బయటకు రానున్నారు. కాగా, ఈ కేసులో కవిత తరపున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ, ఈడీ తరపున ఏఎస్‌జీ వాదనలు వినిపించారు.