కరోనా కాటుకు మాజీ ఎంపీ సబ్బం హరి కన్నుమూత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రాజకీయ నేత కరోనా కాటుకు మృత్యువాతపడ్డారు. అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బం హరి కరోనా సోకి చనిపోయారు. కరోనాతో బాధపడుతున్న ఆయన సోమవారం పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు.
ఏప్రిల్ 15న సబ్బం హరికి కరోనా సోకడంతో తొలుత ఆయన హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతూ వచ్చారు. తర్వాత ఆయన విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు.
అనంతరం సబ్బంహరి పరిస్థితి విషమించడంతో వైద్యులు ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్సను అందిస్తున్నారు. నేటి ఉదయం నుంచే ఆయన పరిస్థితి మరింత విషమంగా మారింది. దీంతో ఆయన కన్నుమూసినట్టు వైద్యులు వెల్లడించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న సబ్బం హరి మంచి వక్తగా, విశ్లేషకుడుగా కూడా పేరుంది. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పాటు.. కాంగ్రెస్ అధిష్టానానికి ఎంతో నమ్మకస్తుడుగా ఉన్నారు.