గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 2 మే 2021 (11:39 IST)

తిరుపతిలో ఫ్యాను గాలి... 61 వేల ఆధిక్యంలో గురుమూర్తి

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి లోక్‌సభ స్థానానికి జరిగిన ఉపఎన్నిక ఓట్ల కౌంటింగ్‌ ఆదివారం ఉదయం నుంచి కొనసాగుతోంది. ఇప్పటివరకు జరిగిన ఓట్ల లెక్కింపులో వైకాపా భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతున్నది. వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి గురుమూర్తి 61,296 ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు. వైసీపీకి 1,47,094 ఓట్లు పోలవగా, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి 85,798 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థికి 12,530 ఓట్లు పోలయ్యాయి.
 
వైసీపీ అభ్యర్థి గురుమూర్తి తొలి రౌండ్ నుంచి ఆధిక్యంలోనే కొనసాగుతూ వచ్చారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో 2500 ఓట్ల లీడ్‌లో ఉన్నారు. తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్‌ మొదటి రౌండ్‌లో 3,817, శ్రీకాళహస్తిలో 1940, సత్యవేడులో​ 1907 ఆధిక్యంలో ఉంది. కౌంటింగ్‌ సందర్భంగా తిరుపతి శాసనసభ నియోజకవర్గంలో 14 రౌండ్లు, సూళ్లూరుపేట నియోజకవర్గంలో గరిష్టంగా 25 రౌండ్లు కౌంటింగ్‌ జరగనుంది. 
 
వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ మృతితో తిరుపతి లోక్‌సభకు ఏప్రిల్‌ 17న ఉపఎన్నిక జరిగింది. వైసీపీ తరపున గురుమూర్తి, టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మి పోటీచేశారు. బీజేపీ - జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా రత్నప్రభ పోటీ చేయగా, కాంగ్రెస్ అభ్యర్థిగా చింతా మోహన్ పోటీ చేశారు. వైకాపా మొదటి స్థానంలోనూ, టీడీపీ రెండో స్థానంలో, బీజేపీ మూడో స్థానంలో కాంగ్రెస్ నాలుగో స్థానంలో ఉన్నారు.