శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 22 ఏప్రియల్ 2018 (12:15 IST)

బహుముఖ ప్రజ్ఞాశాలి, సాహితీవేత్త బాలాంత్రపు రజనీకాంతరావు కన్నుమూత

ప్రముఖ కవి, సాహితీ వేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి ఆకాశవాణి విజయవాడ కేంద్రం విశ్రాంత సంచాలకుడు బాలాంత్రపు రజనీకాంతరావు (99) కన్నుమూశారు. రచయిత, వాగ్గేయకారుడు, సుప్రసిద్ధ సంగీత విద్వాంసుడు అయిన బాలాంత్రపు రజ

ప్రముఖ కవి, సాహితీ వేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి ఆకాశవాణి విజయవాడ కేంద్రం విశ్రాంత సంచాలకుడు బాలాంత్రపు రజనీకాంతరావు (99) కన్నుమూశారు. రచయిత, వాగ్గేయకారుడు, సుప్రసిద్ధ సంగీత విద్వాంసుడు అయిన బాలాంత్రపు రజనీకాంతరావు అనారోగ్యంతో కొంతకాలం బాధపడుతూ వచ్చారని.. ఆదివారం ఉదయం 5.30 గంటలకు తుదిశ్వాస విడిచారని ఆయన కుటుంబీకులు తెలిపారు. 
 
1920 జనవరి 29న పశ్చిమగోదావరి జిల్లా నిడదోలులో రజనీకాంత రావు జన్మించారు. ఆయన తండ్రి బాలాంత్రపు వేంకటరావు ప్రసిద్ది చెందిన వేంకట పార్వతీవ కవుల్లో ఒకరు కావడం విశేషం. 1942 జూలైలో ఆకాశావాణి మద్రాస్‌ కేంద్రంలో కళాకారుడిగా రజనీకాంత రావు చేరారు. ఆకాశవాణిలో తొలి స్వరకర్తగా శ్రోతలను అలరించారు. విజయవాడ ఆకాశవాణి కేంద్రానికి జాతీయస్థాయి గుర్తింపు తెచ్చిన వారిలో రజనీకాంతరావు కీలకమైన వారు. అలాగే తొలితరం సంగీత దర్శకుల్లోనూ బాలాంత్రపు కూడా ఒకరు.
 
''మాది స్వతంత్ర దేశం.. మాదీ స్వతంత్ర జాతి" అనే దేశభక్తి గేయాన్ని రచించి బాణీలు సమకూర్చడంతో పాటు టంగుటూరి కుమారి గానం చేసిన ఆ గీతం తెలుగు జాతికి ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చింది. ఆయన రచించిన వాగ్గేయకార చరిత్ర 20వ శతాబ్దంలో తెలుగులో వచ్చిన గొప్ప పుస్తకాల్లో ఒకటి. ఆయన భక్తిరంజని, ధర్మసందేహాలు వంటి కార్యక్రమాలతో అందరికి సుపరిచితుడు. 
 
పాషాకలం పేరుతో గేయ కవితలు కూడా రాశారు. చండీదాస్‌ గ్రీష్మ రుతువు వంటి స్వీయ రచనలు చేశారు. పలు చలన చిత్రాలకు బాలాంత్రపు సంగీతం అందించారు. బాలాంత్రపు రజనీకాంతరావు మృతి పట్ల సాహిత్య వేత్తలందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బాలాంత్రపు కుటుంబీకులకు సంతాపం తెలిపారు. ప్రభుత్వ లాంఛనాలతో బాలాంత్రపు రజనీకాంత రావు పార్థివ దేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు.