మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 3 డిశెంబరు 2019 (16:32 IST)

వికలాంగులకు ఐదు శాతం రిజర్వేషన్‌

వికలాంగులకు ఐదు శాతం రిజర్వేషన్‌ అమలు చేస్తామని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత హామీ ఇచ్చారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి తానేటి వనితతోపాటు మంత్రి ఆదిమూలపు సురేష్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా తానేటి వనిత మాట్లాడుతూ.. ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. విభిన్న ప్రతిభావంతులకు ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. అందులో భాగంగా వారికి నెలవారీ పెన్షన్‌ రూ.3 వేలకు పెంచామని తెలిపారు. వికలాంగులకు సదరన్‌ సర్టిఫికెట్‌ల జారీలో ఇబ్బందులు తలెత్తిన మాట వాస్తవమేనన్నారు. 
 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల ప్రకారం త్వరలోనే సదరన్‌ సర్టిఫికెట్‌ల జారీ ప్రక్రియను నియోజకవర్గాల్లోని అన్ని పీహెచ్‌సీలలో ప్రారంభిస్తామని పేర్కొన్నారు. డిసెంబర్‌ 15 నుంచి సర్టిఫికెట్‌ల జారీ సులభతరం చేస్తున్నామని వెల్లడించారు. ఆ దిశగా జీవోను జారీ చేస్తామని స్పష్టం చేశారు. విభిన్న ప్రతిభావంతుల, హిజ్రాల వయోవృద్ధుల సంక్షేమ శాఖ, పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.