శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 29 నవంబరు 2019 (17:29 IST)

ఉల్లి ధరలు మరింత పైపైకే.. కేజీ రూ.150కి చేరుతుందా?

దేశవ్యాప్తంగా ఉల్లిధరలు కొండెక్కాయి. రూ.100కుపైగా పెరిగిన ఉల్లిధరలు ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. అమాంతం పైకెగిసిన ఉల్లి పాత రికార్డులను బద్దలుకొడుతోంది. ఈ యేడాది కురిసిన జోరువానలు పంట దిగుబడిని బాగా దెబ్బతీసింది. విదేశాల నుంచి భారీగా దిగుమతులు చేసినా పరిస్థితి అదుపులోకి వచ్చేది అనుమానంగానే కనిపిస్తోంది.
 
దేశం నలుమూలలా అత్యధికశాతం వంటిళ్లలో ఇప్పుడు 'ఉల్లిబాంబులు' పేలుతున్నాయి! మునుపెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో టోకు ధరల విపణుల్లోనే కిలో ఉల్లి రేటు వంద రూపాయలకు పైబడటం వినియోగదారుల్ని నిశ్చేష్టపరుస్తోంది. మహారాష్ట్రలోని సోలాపూర్‌, సంగంనేర్‌ మార్కెట్లలో రూ.110 ధర పలుకుతుండగా, దక్షిణాదిన కోయంబత్తూర్‌ వంటిచోట్ల పెద్దఉల్లి కిలో వంద రూపాయలకు, చిన్నపాయలు రూ.130కి చేరి హడలెత్తిస్తున్నాయి.