ఉల్లి ధరల ఘాటు.. రైతులకు అండగా నిలిచిన జగన్ సర్కారు
ఉల్లి ధరల ఘాటు నుంచి ఉపశమనానికి ప్రభుత్వం చర్యలు
రైతు బజార్లలో కిలో రూ.25 లకే అమ్మాలని నిర్ణయం
అధికారులకు సీఎం శ్రీ వైయస్. జగన్ ఆదేశాలు
ప్రతి రోజూ 150 మెట్రిక్ టన్నులు విక్రయం
ధరల స్థిరీకరణ నిధి నుంచి ఖర్చుచేస్తున్న ప్రభుత్వం
అమరావతి: దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు కొండెక్కిన నేపథ్యంలో సామాన్యులను ఆదుకునేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రైతు బజార్లలో కిలో రూ.25లకే ఉల్లిని అమ్మేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం శ్రీ వైయస్. జగన్ ఆదేశించారు. మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా నెలరోజులపాటు ఈ రేటుకే రైతు బజార్లలో అమ్మాలని ఆయన స్పష్టంచేశారు.
క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్‌ను మార్కెటింగ్‌శాఖ అధికారులు కలిశారు. మార్కెట్లో పెరుగుతున్న ఉల్లిధరలు, అందుబాటులో ఉన్న నిల్వలు తదితర అంశాలను ఆయనకు వివరించారు. దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితులనుకూడా సీఎంకు నివేదించారు. ప్రతిరోజూ రైతుబజార్లలో రూ.25లకే అమ్మాలని సీఎం అధికారులను ఆదేశించారు. 150 మెట్రిక్ టన్నులను రోజూ సరఫరా చేయాలన్నారు.
బిడ్డింగులో నేరుగా పాల్గొంటూ రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నామని అధికారులు చెప్పారు. కర్నూలు మార్కెట్‌కు వచ్చే సరుకులో సగం సరుకును మార్కెటింగ్ శాఖే కొనుగోలు చేస్తోందని అధికారులకు సీఎం వివరించారు. ధరల స్థిరీకరణ నిధిని వినియోగించుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం మార్కెట్లో ఉల్లి ధర నాణ్యత ప్రకారం కిలో రూ.62ల నుంచి రూ.75 మధ్య ఉందని, బిడ్డింగులో కనీస ధర రూ.53 నుంచి రూ. 62ల మధ్య కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. రవాణా ఖర్చులు కలుపుకుంటే..దాదాపు రూ.70 నుంచి 72ల వరకూ వెళ్తోందన్నారు.
ఇంత పెద్దరేటు ఉన్న సమయంలో కిలోకు కనీసం రూ.40–45ల పైబడి రాయితీ ఇచ్చి రైతు బజార్లలో విక్రయిస్తున్నామని, పేదలకు, సామాన్యులకు ఇది ఊరటనిచ్చే నిర్ణయమని అధికారులు చెప్పారు. ధరలు తగ్గేంత వరకూ ఇది కొనసాగాలని సీఎం స్పష్టంచేశారు.
వేరుశెనగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుపై సీఎం సమీక్షించారు. నవంబర్ 25 నుంచి కొనుగోలు కేంద్రాలు తెరవాలని సీఎం ఆదేశించారు. అంతవరకూ తక్కువ ధరకు అమ్ముకోవద్దంటూ రైతులకు సూచించమని సీఎం అధికారులను ఆదేశించారు.
మొక్కజొన్న రైతులను ఆదుకునేందుకు ఇప్పటివరకూ 18 కేంద్రాలు తెరిచామని, 200 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామని అధికారులు సీఎంకు వివరించారు. ధర స్థిరపడేంతవరకూ రైతులను ఆదుకోవాలని సీఎం ఆదేశాలు జారీచేశారు. కొనుగోలు కేంద్రాలు తెరవడంవల్ల మొక్కజొన్న ధర పెరిగిందని అధికారులు సీఎంకు వివరించారు.