శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 16 నవంబరు 2019 (17:54 IST)

గుంటూరులో ఫుడ్‌ కోర్టు..పోలీసులు ఏర్పాట్లు

గుంటూరు వాసులకు ఇక మీదట రాత్రి 10.30 తర్వాత కూడా కోరుకున్న ఆహార పదార్థాలు అన్నీ ఒకేచోట లభించేలా అర్బన్‌ జిల్లా పోలీసులు ఏర్పాట్లు చేశారు.

నగరంలో తోపుడుబళ్లు, వాహనాలపై ఆహార పదార్థాలు విక్రయించే వారందరిని ఒక చోటకు చేర్చి తెల్లవారుజాము ఒకటిన్నర దాకా నిర్భయంగా వ్యాపారం చేసుకునే వెసులుబాటును పోలీసులు కల్పిస్తున్నారు. తొలుత మార్కెట్‌ సెంటర్‌లోని హిందూ కళాశాలకు ఎదురుగా ప్రధాన రహదారి వెంబడి ఈ విక్రయాలు శనివారం రాత్రి నుంచి అందుబాటులోకి రానున్నాయి.

దీనికి ఫుడ్‌ కోర్టుగా నామకరణం చేశారు. రాత్రి 10.30 తర్వాత రహదారుల వెంబడి, ఫుట్‌పాత్‌లపై అల్పాహారం, జంకుఫుడ్స్‌ వంటి విక్రయాలకు తావు లేకుండా అర్బన్‌ పోలీసులు ఉక్కుపాదం మోపనున్నారు. నిర్దేశిత సమయం తర్వాత అనధికారిక విక్రయాలు చేసేవారంతా పోలీసులు ఎంపిక చేసిన మార్కెట్‌ సెంటర్‌కు చేరుకుని విక్రయాలు చేసుకోవాలి.

నగరంలోని అన్ని పోలీసుస్టేషన్ల పరిధిలో విక్రయదారులకు సమాచారమిచ్చి ఎక్కడ పడితే అక్కడ అనధికారిక విక్రయాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఎస్పీ ఆదేశించారు.

డిమాండ్‌కు అనుగుణంగా విస్తరణ
ఈ ఫుడ్‌ కోర్టుకు ప్రజల నుంచి బాగా డిమాండ్‌ ఉంటే నగరంలో మరోచోట ఒకటి ప్రారంభించాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ రకమైన ఏర్పాట్లు ఇప్పటి వరకు నగరంలో లేవు. దీంతో తోపుడు బళ్ల మీద ఆహార పదార్థాలు విక్రయించే వారు అర్ధరాత్రి వరకు రహదారుల వెంబడే ఉంటూ విక్రయాలు చేయడం వల్ల కొందరికి అసౌకర్యం ఏర్పడుతోంది.

ప్రధాన రహదారుల్లోనే కాదు, అరతర్గత రహదారుల్లో జనవాసాల మధ్య మరికొందరు బాగా పొద్దుపోయే వరకు అల్పాహారం, పానీపూరీ, నూడిల్స్‌ వంటివి విక్రయిస్తున్నారు. ఈ అనధికారిక విక్రయాలకు ఇక మీదట కళ్లెం పడనుంది. రాత్రి 11-12 గంటల మధ్య కూడా యువత రహదారుల పైనే ఉంటోంది. అదేమని పోలీసులు నిలదీస్తే టిఫిన్‌ చేయడానికి వచ్చామని చెబుతున్నారు.

ఇదే అదనుగా కొందరు ఆ సమయంలో రహదారుల వెంబడి వెళ్లే ప్రయాణికులను బెదిరింపులకు గురి చేసి దోపిడీలకు పాల్పడుతున్నారు. నగరంలో 10.30 తర్వాత అనధికారిక విక్రయాలకు తావు లేకుండా చేస్తే రహదారులపై యువత, మందుబాబుల ఆగడాలు తగ్గుముఖం పడతాయని భావించారు.


తొలుత అధ్యయనం చేసిన అర్బన్‌ ఎస్పీ అసలు నగరంలో 10.30 తర్వాత ఆహార పదార్థాలు తినడానికి ఎంత మంది వస్తున్నారని అర్బన్‌ జిల్లా ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ మూడు రోజుల కిందట స్వయంగా వెళ్లి నగరంలో అన్ని ప్రధాన రహదారుల్లో అధ్యయనం చేశారు.

నగరంలోని నలుగురు డీఎస్పీలు, ఇతర పోలీసు అధికారులను ఆయన వెంట వెళ్లారు. నగరవాసులు అందరికీ ఉపయుక్తంగా ఉండేలా ఫుడ్‌కోర్టు ఎక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందో పరిశీలించారు. రైల్వేస్టేషన్‌, బస్టాండుకు చేరుకునేవారు, కూరగాయల కోసం అత్యధికులు మార్కెట్‌ సెంటర్‌ మీదుగానే ఆయా ప్రాంతాలకు వెళ్తారని, ఇది అనువైన ప్రదేశంగా గుర్తించారు.

పోలీసుల కనుసన్నల్లో విక్రయాలు...
ఫుడ్‌ కోర్టు ప్రదేశంలో పోలీసుల నిఘా ఉంటుంది. నగరంలోని ఆరు స్టేషన్ల నుంచి ప్రతి అర గంటకు ఒక్కో స్టేషన్‌ నుంచి పోలీసు బృందం గస్తీకి వస్తుంది. ఆపై గాంధీపార్కు వద్ద పోలీసు అవుట్‌ పోస్టు ఒకటి నిరంతరం పని చేస్తుంది. ఈ ఫుడ్‌కోర్టు వద్దకు వచ్చేవారికి ఎలాంటి అసౌకర్యం ఉండదు.

ఎవరైనా ఇతరులకు అసౌకర్యం కలిగిస్తే వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటారు. వీధి వ్యాపారులకు రాత్రి 10.30 నుంచి తెల్లవారుజాము 1.30 వరకు విక్రయాలు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ తెలిపారు. దీనికి వ్యాపారులు సహకరించాలని ఆయన కోరారు.