బాబోయ్.. దెయ్యం అంటూ బెంబేలెత్తిపోతున్న గ్రామస్తులు.. ఎక్కడ?
శ్రీకాకుళం జిల్లాలోని పలాస మండలం టెక్కలిపట్నంలో నివసిస్తున్న గ్రామస్తులకు దెయ్యం భయం పట్టుకుంది. గ్రామంలో దెయ్యం తిరుగుతోందని ప్రజలు భయపడుతున్నారు. రాత్రి పదిగంటలు దాటితే చాలు జనాలు వణికిపోతున్నారు. రాత్రివేళ ఆడ దెయ్యం ఊరి పొలిమేరలో తిష్టవేసిందని, తమను భయభ్రాంతులకు గురిచేస్తోందని గ్రామస్తులు చెబుతున్నారు.
ఎవరైనా ధైర్యం చేసి అటు వెళితే వారిపై రాళ్లు, ఇసుకతో దాడి చేస్తోందని అంటున్నారు. 7 అడుగుల ఎత్తుతో జుట్టు విరబూసుకుని ఉన్న ఆకారంతో రాత్రి వేళల్లోనే ప్రత్యక్షమవుతుందని భయంభయంగా చెబుతున్నారు.
కాగా గ్రామస్తులు చెబుతున్న మాటలను జన విజ్ఞాన వేదిక సభ్యులు తోసిపుచ్చారు. దెయ్యాలు, భూతాలు అనేవి లేవని స్పష్టం చేశారు. మనిషిలో ఉన్న భయమే అలాంటి అపోహలకు కారణం అన్నారు.
దీనిపై అధికారులు స్పందించి గ్రామస్తుల్లో చైతన్యం తీసుకురావాలని, వారిలోని అపోహలను తొలగించాలని కోరారు. ఇసుకతో దాడి చేయడం, రాళ్లతో కొట్టడం ఆకతాయిల పని అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.