నాకు గొప్ప పదవి జనసైనికుడు, పవన్ కల్యాణ్ జనం మనిషి: మెగా బ్రదర్ నాగబాబు
జనసేనలో తన సొంత సోదరుడికే పవన్ కల్యాణ్ టిక్కెట్ ఇవ్వలేదనీ, అందుకు ఆగ్రహించి మెగాబ్రదర్ నాగబాబు తన ఫోనుని స్విచాఫ్ చేసుకున్నారంటూ చేసిన కొందరి వ్యాఖ్యలకు నాగబాబు స్ట్రైట్ రిటార్డ్ ఇచ్చారు. జనసైనికుడిగా పనిచేయడం కంటే గొప్ప పదవి ఇంకేమీ లేదని స్పష్టం చేసారు. ట్విట్టర్ ఎక్స్ లో ఆయన వీడియో ద్వారా సందేశాన్ని పోస్ట్ చేసారు.
జనసేన 11వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ... జనసేనలో పదవుల కోసం కాకుండా ప్రజల కోసం పాటుపడేవారు లక్షల్లో వున్నారని అన్నారు. ఎందరో నాయకులు పదవుల కోసం కాకుండా తమ నాయకుడి లక్ష్యం కోసం పనిచేస్తున్నారని కితాబునిచ్చారు. ప్రజల కోసం అన్నింటిని త్యాగం చేసేవారు చాలా అరుదుగా వుంటారనీ, అలాంటివారిలో మా పవన్ కల్యాణ్ ఒకరని ప్రశంసించారు. ఆంధ్ర ప్రజల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న జనసేనానికి వెన్నుదన్నుగా వుంటున్న జనసైనికుల్లో ఒకడిగా పనిచేస్తానని చెప్పారు.