శనివారం, 2 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 14 మార్చి 2024 (16:16 IST)

గత ఎన్నికల్లో రెండు చోట్లా ఓడిపోతానని తెలుసు.. కానీ యుద్ధంలో దిగాక... : పవన్ కళ్యాణ్

pawan kalyan
గత 2019లో జరిగిన ఎన్నికల్లో తాను పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోతానని ముందే తనకు తెలుసని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆ పార్టీ 11వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం మంగళగిరిలో జరిగిన ఆవిర్భావ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 2019లో 30 స్థానాల్లో పోటీ చేద్దామని అనుకున్నాను. కానీ, అందరూ ఒత్తిడి చేయడంతో నిస్సహాయ పరిస్థితుల్లో రాష్ట్రమంతా పోటీ చేయాల్సి వచ్చింది. దారుణం ఏంటంటే.. ఆ సమయంలో నేను ఓడిపోతున్నానన్న సంగతి కూడా నాకు తెలుసు. ఒకసారి యుద్ధంలో దిగాగ ఓటమి, గెలుపు గురించి ఆలోచించకుండా యుద్ధమే చేయాలి. గాజువాకలో ఎలాగూ ఓడిపోతానని తెలుసు. ప్రచారం ముగియగానే భీమవరంలో కూడా ఓడిపోతున్నానని గ్రహించాను అని చెప్పారు. 
 
రెండు చోట్ల ఓడిపోయిన తర్వాత దేశం మీద, సమాజం మీద ఇంత పిచ్చి మంచిదా? అనిపించింది. కానీ, నాకు భగవంతుడు ఒకటే చెప్పాడు. అది నా బాధ్యత కాబట్టి నిర్వర్తించు అన్నాడు. కర్మయోగిలా పని చేసుకుంటూ వెళ్లు.. ఫలితం కోసం చూడకు అనే సూత్రాన్ని పాటిస్తాను అని చెప్పాడు. ఓ దశలో పార్టీ ఎలా నడపాలో నాకు తెలియలేదు. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అనుకున్నాను. అలాంటి సమయంలో నా వెన్నంటే ఉన్న మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను సమాజం కోసం ఆలోచిస్తే నాకోసం ఆలోచించేవాడు ఒకరుండాలి కదా. నాకోసం "వకీల్ సాబ్" తదితర సినిమాల్లో త్రివిక్రమ్ పాలు పంచుకున్నారు అంటూ పవన్ భావోద్వేగంతో చెప్పారు. 
 
పీఠాపురం నుంచి జనసేనాని పోటీ : స్వయంగా వెల్లడించిన పవన్ కళ్యాణ్ 
 
ఏపీ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానం ఏదో తేలిపోయింది. ఆయన పీఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నట్టు గురువారం స్వయంగా ప్రటించారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. గత ఎన్నికల్లో ఆయన గాజువాక, భీమవరం అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆయన ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్న సస్పెన్స్ కొనసాగుతూ వచ్చింది. దీనికి ఆయన తెరదించారు. పిఠాపురం నుంచి పోటీ చేయనున్నట్టు గురువారం స్వయంగా ప్రకటించారు. అలాగే, ప్రస్తుతానికి తనకు ఎంపీగా పోటీ చేసే ఆలోచన ఏదీ లేదని ఆయన స్పష్టం చేశారు. 
 
గత 2014లో పార్టీ స్థాపించగానే పిఠాపురం నుంచి పోటీ చేయాలని చాలా మంది అడిగారన్నారు. తెలంగాణ నుంచి, పిఠాపురం నుంచి పోటీచేయమంటూ తనకు వినతులు వచ్చాయన్నారు. అయితే, రాష్ట్రం కోసం ఆలోచించి అపుడు పిఠాపురం నుంచి పోటీ చేయలేకపోయానని చెప్పారు. నిజంగా చెప్పాలంటే ఎన్నికల గురించి తాను ఎపుడూ ఆలోచించలేదని, అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో నిలబడదామని అనుకున్నానని, అందుకే 2014లో పార్టీ ఆఫీస్‌ను కూడా అక్కడ నుంచి ప్రారంభించానని చెప్పారు.