రెండుచోట్ల ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థిని, కూటమి కోసం ఎంతో శ్రమించా: పవన్ కల్యాణ్
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్న దానిపై సందిగ్ధత నెలకొని వుంది. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం ప్రకారం పవన్ కల్యాణ్ భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి, కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తారని వినబడుతోంది. కానీ తన పోటీపై పవన్ ఇప్పటివరకూ స్పష్టత ఇవ్వలేదు. ఇదిలావుంటే జనసేనలో మాజీ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు చేరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెదేపా-జనసేన-భాజపా కలిసి పోటీ చేస్తున్నాయంటే దాని క్రెడిట్ అంతా పవన్ కళ్యాణ్ గారిదే. ఎందుకంటే... 2019 ఎన్నికల్లో జరిగిన ఘటనల వల్ల తెదేపా-భాజపా కలిసే పరిస్థితి లేకుండా పోయింది. అలాంటి స్థితిని అధిగమించి ఆ రెండు పార్టీలను దగ్గరకు చేర్చి, కొన్ని స్థానాలను వదులుకుని రాష్ట్రం అభివృద్ధి కోసం పవన్ త్యాగం చేసారు. అందుకే ఆయనకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా అని అన్నారు.
అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... రెండు చోట్ల ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థిని. అటువంటి అభ్యర్థికి కేంద్రంలోని భాజపా సముచిత గౌరవం ఇచ్చింది. అలాగే భాజపా-తెదేపాలను కూటమిలో కలుపుకుపోయేందుకు నేను ఎంతగానో శ్రమించాను. రాష్ట్రాభివృద్ధికోసం కొన్ని త్యాగాలు చేయాల్సిందే. అది తెదేపా అయినా లేదంటే జనసేన అయినా. భీమవరం అసెంబ్లీ నియోజకవర్గాన్ని మనం గెలవబోతున్నాం. కూటమి అధికారంలోకి వస్తుంది. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుంది అని అన్నారు పవన్ కల్యాణ్.