ఆదివారం, 3 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 12 మార్చి 2024 (12:15 IST)

సీట్ల సంఖ్య.. హెచ్చుతగ్గుల కంటే రాష్ట్ర శ్రేయస్సే ముఖ్యం : పవన్ కళ్యాణ్

pawan kalyan
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకునే తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు జరిగిందని జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ అన్నారు. సీట్ల సంఖ్య.. హెచ్చుతగ్గుల కంటే రాష్ట్ర శ్రేయస్సే ముఖ్యమని మూడు పార్టీలు దృఢసంకల్పంతో ముందడుగు వేశాయన్నారు. ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ సీట్ల పంపిణీ ఈ మూడు పార్టీల మధ్య ముగిసిపోయింది. ఇందులో కూడా పవన్ కళ్యాణ్ మరో మారు త్యాగం చేశారు. తమ పార్టీకి కేటాయించిన 24 అసెంబ్లీ సీట్లలో బీజేపీకి మూడింటిని కేటాయించి తాను 21 సీట్లతో సర్దుకునిపోయారు. దీనిపై జనసైనికులు, నేతలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆయన ఈ సీట్ల సర్దుబాటుపై ఆయన స్పందించారు. 
 
ప్రధాని నరేంద్ర మోడీ శక్తిమంతమైన, దార్శనిక నాయకత్వంలో ఏపీలో జరుగనున్న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేనలు కలిసి పని చేస్తాయని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రగతి, ప్రజల స్థితిగతుల మెరుగుదలకు మూడు పార్టీలు కట్టుబడివున్నాయని చెప్పారు. రాష్ట్ర భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని సీట్ల పంపకం జరిగిందన్నారు. సీట్ల సంఖ్య, హెచ్చుతగ్గుల కంటే రాష్ట్ర శ్రేయస్సే ముఖ్యమన్న దృఢ సంకల్పంతో మూడు పార్టీలు కలిసికట్టుతో ముందడుగు వేశాయని పేర్కొన్నారు. 
 
ఈ కూటమి అవిర్భావంతో రాష్ట్ర పురోభివృద్ధికి ఒక బలమైన పునాది పడిందనేది తమ ప్రగాఢ విశ్వాసమని చెప్పారు. ఎన్డీయే భాగస్వాములుగా రాష్ట్ర ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటామని చెప్పారు. చర్చల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్, బీజేపీ ఉపాధ్యక్షుడు బైజయంత్ పాండా, టీడీపీ చీఫ్ చంద్రబాబులకు పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.