నిడదవోలు జనసేన అభ్యర్థిగా కందుల దుర్గేశ్.. ప్రకటించిన పవన్ కళ్యాణ్
ఏపీలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల పోటీ చేసే అభ్యర్థులను ఆయా రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్నాయి. ఇందులోభాగంగా, తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు అసెంబ్లీ నుంచి జనసేన - టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీ నేత కందుల దుర్గేశ్ పోటీ చేస్తారని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ఆయన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. బీజేపీ, జనసేన, టీడీపీ తరపున ఆయన నిడదవోలు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు.
కాగా, ఇప్పటికే నెల్లిమర్ల అసెంబ్లీ స్థానం నుంచి లోకం మాధవి, అనకాపల్లి నుంచి కొణతాల రామకృష్ణ, కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ, తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్, రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణల పేర్లను పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే. తొలి జాబితాలో జనసేన ఐదుగురు పేర్లను ప్రకటించగా, టీడీపీ 94 మంది అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. మరోవైపు, టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య కుదిరిన పొత్తులో భాగంగా, జనసేన - బీజేపీ పార్టీలకు 8 లోక్‌సభ, 30 అసెంబ్లీ స్థానాలను కేటాయించినట్టు తెలుస్తుంది. అయితే, ఈ సీట్ల పంపిణీపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.