పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానంపై ఉత్కంఠత!! ఎంపీనా లేదా ఎమ్మెల్యేనా!?
వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వచ్చే ఎన్నికల్లో ఆయన ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్నదానిపై రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా చర్చతో పాటు బెట్టింగులు కూడా సాగుతున్నాయి. ముఖ్యంగా, ఎంపీగా పోటీ చేస్తారా లేక ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా అనే దానిపై జనసైనికులతో పాటు రాష్ట్ర ప్రజానీకంపై చర్చ సాగుతుంది.
మరోవైపు పవన్ పోటీ చేసేందుకు 4 అసెంబ్లీ నియోజకవర్గాలపై పార్టీ నాయకులు దృష్టి సారించారు. తొలుత పవన్ భీమవరం నుంచి పోటీ చేస్తారని చెప్పారు. దానిలో భాగంగానే గత నెలలో భీమవరంలో పర్యటించిన ఆయన అక్కడ టీడీపీ, బీజేపీ నేతలతో నేరుగా మాట్లాడారు. ఇక్కడ పోటీ చేస్తే ఈసారి బంపర్ మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది. కానీ అనూహ్యంగా పవన్ ప్లాన్ మార్చుకున్నారు. అక్కడ టీడీపీలో ఉన్న అంజిబాబును జనసేన పార్టీలో చేర్చుకుంటున్నారు. అంజిబాబునే జనసేన నుంచి పోటీ చేయించాలని నిర్ణయించారు. అందులో భాగంగా భీమవరం నాయకులను మంగళగిరికి పిలిపించి మరీ చర్చించారు.
ఆ సమావేశాలో అంజిబాబు కూడా పాల్గొన్నారు. తర్వాత పవన్ భీమవరం నుంచి తప్పుకుంటున్నట్లు స్పష్టత వచ్చింది. ఇక, పిఠాపురం వైపు కూడా పవన్ చూస్తున్నట్లు తెలుస్తోంది. పిఠాపురంలో కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉంది. అక్కడ తంగెళ్ల ఉదయ్ పార్టీని బలోపేతం చేయడంతో పాటు నాయకుల సమీకరణ చేశారు. తొలుత ఉదయ్.. పిఠాపురం నుంచి పోటీ చేయాలని భావించారు. పవన్ కూడా ఆయననే పిఠాపురం ఇన్చార్జిగా నియమించారు. కానీ, ఉదయ్ మాత్రం అధినేత అక్కడ నుంచి పోటీ చేస్తే బాగుంటుందని సూచించారు. పవన్ కల్యాణ్ కూడా సుముఖత వ్యక్తం చేశారు.
మరోవైపు కాపు సామాజిక వర్గం మొత్తం పిఠాపురం నుంచి పవన్‌ను పోటీ చేయాలని లేఖలు రాస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ జాబితాలో పిఠాపురం కూడా చేరింది. గాజువాకపై కూడా.. విశాఖలోని గాజువాకపైనా పవన్ దృష్టి పెట్టారు. 2019 ఎన్నికల్లో గాజువాక నుంచి పోటీ చేసిన ఆయన దాదాపు 50 వేల ఓట్లు సాధించారు. ప్రస్తుత పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. టీడీపీ - జనసేన కలవడంతో గాజువాక జనసేనకు కంచుకోటగా మారింది. పైగా, స్థానిక వైసీపీ ఎమ్మెల్యేపై వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉంది. గాజువాకలో జనసేనకు దాదాపు 8 వేల మంది క్రీయాశీలక కార్యకర్తలున్నారు. ఎన్నికల్లో పోల్ మేనేజ్‌మెంట్‌కు అవసరమైన అన్ని ఏర్పాట్లు గాజువాకలో చేశారు.
కాగా, గాజువాక స్థానంపై జనసేన పూర్తిస్థాయిలో దృష్టి పెట్టింది. అధినేత అక్కడ నుంచి పోటీ చేస్తే దాదాపు లక్ష మెజారిటీ వచ్చేలా చేయాలన్న సంకల్పంతో నాయకులు, కేడర్ పని చేస్తోంది. కానీ, పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. మరోవైపు తిరుపతి అసెంబ్లీ నుంచి పవన్ పోటీ చేయాలన్న డిమాండ్లు పుట్టుకొస్తున్నాయి. గతంలో ప్రజారాజ్యం పార్టీ అధి నేత చిరంజీవి ఇక్కడ పోటీ చేసి గెలుపొందారు. కాబట్టి, మరోసారి మెగా కుటుంబం నుంచి తిరుపతిలో పోటీ చేయాలని స్థానిక నాయకులు కోరుతున్నారు. తిరుపతి నియోజక వర్గం నాయకులు కూడా ఇదే మాట చెబుతున్నారు. అయితే, పవన్ కళ్యాణ్ మనసులో ఏమున్నదో మాత్రం ఎవరికీ అంతుచిక్కడం లేదు.