మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 31 అక్టోబరు 2023 (07:39 IST)

ప్రియుడి మోజులో ఐదేళ్ల కుమారుడిని హత్య చేసిన కసాయి తల్లి!!

murder
ప్రియుడి మోజులో పడిన ఓ కసాయి తల్లి తన ఐదేళ్ల కుమారుడిని హత్య చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెతో పాటు ఆమె ప్రియుడిని కూడా అరెస్టు చేశారు. ఈ ఘటన విశాఖపట్టణం జిల్లా గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ నెల 28వ తేదీన పాత గాజువాకలో ఓ అపార్టుమెంటులోని నీటి సంపులో ఐదేళ్ల బాలుడు వేదాంత్ మృతదేహం వెలుగు చూసింది. అపార్టుమెంట్ వాచ్‌మెన్‌గా పని చేస్తున్న దూది దొరబాబుకు భార్య మణి (30), కుమారులు శంకర్ (వేదాంత్ (5) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే, గత నెల 24వ తేదీన భార్య మణి భర్తతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయింది. 
 
ఆమెతో వేదాంత్‌ వెళ్లి ఉంటాడని భావించిన దొరబాబు పెద్ద కుమారుడితో ఇంటి పట్టునే ఉంటున్నాడు. 28న సంపు నుంచి దుర్వాసన రావడంతో అపార్టుమెంట్‌ వాసులు అందులో చూస్తే వేదాంత్‌ మృతదేహం ఉబ్బిపోయి బయటపడింది. తొలుత అనుమానాస్పద మరణంగా గాజువాక పోలీసులు భావించారు.
 
తీరా సీసీ ఫుటేజీలను పరిశీలిస్తే మణి కావాలనే ఆ రాత్రి నిద్రపోతున్న సమయంలో వేదాంత్‌ను సంపులో పడేసి పరారైనట్లు గుర్తించారు. ఆమె చరవాణి లొకేషన్‌ పరిశీలిస్తే హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించి అక్కడకు వెళ్లి వారిని పట్టుకుని గాజువాక పీఎస్‌కు తీసుకొచ్చి విచారిస్తే అసలు బాగోతం బయటపడింది. 
 
గతంలోనూ మణి భర్తతో గొడవ పడి నాలుగుసార్లు హైదరాబాద్‌ వెళ్లింది. అక్కడ ఉప్పల్‌లో ఉంటున్న కాకినాడకు చెందిన పాత గంజాయి నేరస్థుడు పనసకుమార్‌(31)తో రైల్లో పరిచయం కాగా కొద్ది రోజులుగా ఫోనులో వీరిద్దరూ మాట్లాడుకోవడం, అప్పుడప్పుడు ఈమె ఉప్పల్‌ వెళ్లడం జరుగుతోంది. 
 
తనను పెళ్లి చేసుకోవాలంటే పిల్లలను వదిలించుకోవాలని పనసకుమార్‌ సూచించడంతో ఆమె ప్రియుడి మోజులోపడి ఆ రోజు వేదాంత్‌ను కడతేర్చిందని సీఐ భాస్కరరావు తెలిపారు. మణితోపాటు పనసకుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు.