శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

నాటకీయ పరిణామాల మధ్య టీడీపీ నేత బండారు అరెస్టు

bandaru
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఏపీ మంత్రి ఆర్కే రోజాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం అర్థరాత్రి నుంచి హైడ్రామా సృష్టించిన పోలీసులు.. సోమవారం సాయంత్రం అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయన్ను మంగళవారం తెల్లవారుజామున గుంటూరు తీసుకొచ్చారు. వైద్య పరీక్షలు చేయించకుండానే ఆయన స్వగ్రామం వెన్నెలపాలెం నుంచి గుంటూరులోని నగరంపాలెం పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చారు.
 
ఆదివారం రాత్రి 10 గంటల నుంచి బండారు సత్యనారాయణమూర్తి వెన్నెలపాలెంను చుట్టుముట్టిన పోలీసులు దాదాపు 22 గంటల పాటు ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలో ఉంచుకుని చివరికి సోమవారం రాత్రి ఆయనను అరెస్టు చేశారు. మంత్రి రోజాపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గుంటూరులో బడి మంజుల చేసిన ఫిర్యాదుపై నమోదైన కేసులో బండారును అరెస్టు చేశారు.
 
వాసిరెడ్డి పద్మ ఫిర్యాదుతో 
ఏపీ పర్యాటక మంత్రి, సినీ నటి ఆర్కే రోజాపై చేసిన అభ్యంతర వ్యాఖ్యలకు గాను టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తిని అరెస్టు చేశారు. ఆదివారం అర్థరాత్రి నుంచి ఆయన ఇంటివద్ద భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మొహరించారు. దీంతో బండారును ఏ క్షణమైనా అరెస్టు చేయొచ్చన్న ప్రచారం సాగుతుంది. ఏపీ డీజీపీకి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ రాసిన లేఖతో ఆయన్ను అరెస్టు చేశారు. 
 
మరోవైపు.. బండారుపై గుంటూరులో రెండు కేసులు నమోదయ్యాయి. నగరంపాలెం, అరండల్ పేట పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. వైసీపీ కార్యకర్త మంజుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసులు నమోదు చేశారు. మంత్రి రోజాపై వ్యక్తిగత దూషణలు చేశారని ఫిర్యాదులో వైసీపీ కార్యకర్త పేర్కొన్నారు. దీంతో బండారుపై ఐపీసీ సెక్షన్ 153 (ఏ), 504, 354 (ఏ) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 505, 506, 509, 499, ఐటీ చట్టం సెక్షన్-67 కింద కేసు కూడా పోలీసులు నమోదు చేశారు.
 
దీంతో.. నాటి నుంచే ఏ క్షణమైనా అరెస్టు చేయొచ్చని సోషల్ మీడియా, వైసీపీ అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే.. ఆదివారం అర్థరాత్రి నుంచి అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వెన్నెలపాలెంలోని బండారు ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అంతేకాదు.. బండారు నివాసానికి వెళ్లే దారిలోని సినిమా హాలు కూడలి, వెన్నెలపాలెం ప్రాంతాల్లోనూ పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటుచేశారు. ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరూ రాకుండా పోలీసులు అడ్డుకుంటూ వస్తున్నారు.