బుధవారం, 13 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 2 ఆగస్టు 2024 (12:52 IST)

వైకాపా మత్తులోనే జోగుతున్న అధికారు.. తీరు మార్చుకోరా? ఎమ్మెల్యే గల్లా మాధవి (Video)

galla madhavi
గుంటూరు పశ్చిమ నియోజకవర్గములో డ్రైనేజి సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని అధికారులతో పదేపదే సమీక్షలు నిర్వహించి, క్షేత్రస్థాయిలో పర్యటించిన కూడా అధికారుల్లో చలనం రాకపోవటం దురదృష్టకరం అని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి వాపోయారు. బుధవారం 21వ డివిజన్‌లో రెండో రోజు వికలాంగుల కాలనీలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి పర్యటించారు. 
 
ఈ సందర్భముగా ప్రజలు ఎమ్మెల్యేతో తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ ప్రాంతం మొత్తం గంజాయికి అడ్డాగా మారిపోయిందని, ఖాళీ స్థలాల్లో గంజాయి సేవించి, ప్రజల మీద దాడులకు పాల్పడుతున్నారని, వీళ్ళ చర్యలు తీసుకొని తమకు రక్షణ కల్పించాలని కోరారు. అదేవిధంగా ఈ డివిజన్ మొత్తం పారిశుధ్య లోపం స్పష్టం కనిపిస్తున్నదని, అయినా కూడా అధికారులు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించటం దేనికి సంకేతమో చెప్పాలని అధికారులను నిలదీశారు. 
 
వికలాంగుల కాలనీలోని ప్రభుత్వ పాఠశాల నిర్వహణ అధ్వాన్నంగా ఉందని, పిల్లలు చదవుకునే పాఠశాల ఆవరణలో చెత్తచెదారం, పిచ్చి మొక్కలతో నిండి, మురుగునీరు నిలిచి భయానకరంగా ఉన్న ప్రాంతాన్ని ఎమ్మెల్యే పరిశీలించి, ఇంత అధ్వాన్నస్థితికి గల కారణాలు అధికారులను అడుగగా ఈ ప్రాంతాల్లో పారిశుద్ధ్య యంత్రాలు ఈ ప్రాంతంలోకి రావటం కష్టమని తెలిపారు. 'ఇలా ప్రతి సమస్యకు దాటవేట ధోరణిలో సమాధానాలు ఇస్తే  సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుందో సమాధానం చెప్పాలని, అసలు ఇంత నిర్లక్ష్యం వ్యవహరిస్తే పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు ఎలా వస్తారా? అసలు ఈ వాతావరణంలో ఉన్న పాఠశాలకు మీ పిల్లలను పంపిస్తారా? అని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
కుంటి సాకులు, కారణాలు చెప్పకుండా ఈ సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రాంతంలో వీధిదీపాలు వెలగటం లేదని, గతంలో ప్రజాప్రతినిధులు ఇటువైపు తొంగిచూసేవారు కారని, ఇప్పుడు నేరుగా ఎమ్మెల్యేనే రెండో రోజుల పాటు పర్యటించటం పట్ల డివిజన్ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.