ఏపీలో నవంబరు 2 నుంచి ఒంటిపూట బడి
ఏపీ సీఎం జగన్ పాఠశాలల పునఃప్రారంభంపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నవంబరు 2 నుంచి స్కూళ్లు తెరవాలని ఇప్పటికే ప్రకటించగా, అందుకు సంబంధించిన విధివిధానాలను సీఎం జగన్ ఖరారు చేశారు.
రోజు విడిచి రోజు తరగతులు నిర్వహించేలా కార్యాచరణ రూపొందించినట్టు సీఎం వెల్లడించారు. 1, 3, 5, 7 తరగతులు ఒకరోజున, 2, 4, 6, 8 తరగతులు మరో రోజున నిర్వహిస్తామని తెలిపారు.
విద్యార్థుల సంఖ్య 750కి పైగా ఉంటే మూడు రోజులకు ఒకసారి తరగతులు జరుపుతామని అన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో నవంబరులో ఒకపూటే తరగతులు ఉంటాయని సీఎం వెల్లడించారు.
ఒకవేళ తల్లిదండ్రులు పిల్లలను పాఠశాలకు పంపేందుకు ఇష్టపడకపోతే వారికోసం ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తారని తెలిపారు.
అన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పెట్టిన తర్వాత విద్యార్థులను ఇళ్లకు పంపుతామని వివరించారు. పాఠశాలల వేళలపై డిసెంబరులో పరిస్థితిని మరోసారి సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు.