మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 14 సెప్టెంబరు 2019 (17:49 IST)

మూడు నెలల్లో ఏ పనైనా వైసీపీ ప్రభుత్వం చేసిందా?.. దేవినేని

పోలవరం నిర్మాణంలో గత మూడు నెలల్లో ఎక్కడా కూడా ఒక తట్టమట్టి కానీ, ఒక బొచ్చెడు కాంక్రీటుగానీ వేయని జగన్మోహన్‌రెడ్డి నేడు రాయలసీమకు నీళ్లిచ్చామని గొప్పలు చెప్పడం, తెలుగుదేశం ప్రభుత్వం చేసిన పనిని తనఖాతాలో వేసుకోవడం, ఆయనలోని రివర్స్‌ బుద్ధికి నిదర్శనంగా నిలిచిందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎద్దేవా చేశారు.

ఆయన గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మచ్చుమర్రి, గండికోట, పులివెందులకు నీళ్లొచ్చినా, రాయలసీమలోని బీడుభూముల్లో నేడు నీళ్లు పారినా ఆ ఘనత చంద్రబాబునాయుడికే దక్కుతుందని ఉమా స్పష్టంచేశారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాయలసీమకు నీళ్లిస్తే గుర్తించలేని, నిజాలను గుర్తించలేని వైసీపీ కబోదులు, నేడు అధికారంలోకి వచ్చాక కూడా  అదే విధంగా, వక్రబుద్ధితో చౌకబారు ఆరోపణలు చేస్తున్నాయన్నారు. గతంలో జగన్‌ తండ్రి అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను అటకెక్కించాడన్న ఉమా, నేడు జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే పోలవరాన్ని పడుకోబెట్టాడన్నారు.

తండ్రీ కొడుకులు, కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు పడుకోబెట్టిన పోలవరం పనులను, చంద్రబాబు ముఖ్యమంత్రయ్యాక పరుగులు పెట్టించాడని, దానికి నిదర్శనమే నేడు సీమలో పారుతున్న కృష్ణా, గోదావరి జలాలని ఆయన స్పష్టం చేశారు.

రివర్స్‌ పాలనతో, రివర్స్‌ గేరులో వెళుతున్న వైసీపీ ప్రభుత్వం లక్షల క్యూసెక్కుల కృష్ణా, గోదావరి జలాలను సముద్రం పాలు చేసిందని, పోతిరెడ్డిపాడు సహా, అనేక పథకాలు ఈప్రభుత్వ అసమర్థత, చేతగానితనం వల్ల ఎందుకూ కొరగాకుండా పోయాయని ఉమామహేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు.

గత కాంగ్రెస్‌ ప్రభుత్వాలు, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జమానాలో తోటపల్లి రిజర్వాయర్‌ నిర్మాణాన్ని గాలికొదిలేస్తే, టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఆ రిజర్వాయర్‌ నిర్మాణం పూర్తిచేసి, ఆ నీళ్లను శ్రీశైలానికి తరలించడం జరిగిందన్నారు.

జగన్‌ అధికారంలోకి వచ్చాక ఎక్కడిపనులు అక్కడే నిలిచిపోయాయని, వంశధార-నాగావళి సహా, హంద్రీనీవా సుజల స్రవంతి, గోదావరి-పెన్నా అనుసంధానం వంటి పథకాల పనులు ఎందుకు నిలిచాయో ఆయనే సమాధానం చెప్పాలని దేవినేని డిమాండ్‌ చేశారు.

పురుషోత్తమపట్నం పంపులద్వారా విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు నీళ్లిచ్చిన ఘనత కూడా తెలుగుదేశాని దేనన్న ఆయన, పులిచింతలలో నీళ్లు నిల్వచేయడానికి తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికోట్లు ఖర్చుపెట్టిందో ముఖ్యమంత్రి జగన్‌ సమాధానం చెప్పాలన్నారు. ఉత్తరాంధ్రకు గుండెకాయ వంటి సాగునీటి ప్రాజెక్టులన్నీ ఎక్కడివక్కడే నిలిపేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.

జలయజ్ఞం పేరుతో జరిగిన అవినీతిని, ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న జగన్‌ మరిచిపోయినా, రాష్ట్ర ప్రజలెవరూ మర్చిపోలేదని ఉమా తెలిపారు. పోలవరం సహా, ఇతర సాగునీటి ప్రాజెక్టులకు రూ.55వేల కోట్లు ఖర్చుపెట్టి, దేశవ్యాప్తంగా సాగునీటి రంగంలో మేలైన విధానాలు అవలంభించినందుకుగాను, తెలుగుదేశం హయాంలో రాష్ట్రానికి 74 పాయింట్లు వచ్చిన విషయాన్ని నీతిఅయోగ్‌ గుర్తించినా, నీతిమాలిన జగన్‌ సర్కారు గుర్తించడం లేదన్నారు.

రివర్స్‌ టెండర్ల పేరుతో డ్రామాలాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి, పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీకి (పీపీఏ) మినిట్స్‌ పేరుతో కుంటిసాకులు చెబుతూ తప్పించుకుంటోందని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ఇరిగేషన్‌ పనుల్లో పది, పదిహేను శాతం తక్కువకు టెండర్లు వేశారని చెబుతున్న జగన్‌, ఆ విధంగా వచ్చిన టెండర్లనే ఎస్‌ఎస్‌ఆర్‌గా ఆయన నిర్ణయిస్తారా అని మాజీమంత్రి ప్రశ్నించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రే స్వయంగా టెండర్లు తక్కువకు వేసేలా శాసనసభలో సంకేతాలిచ్చారన్న ఆయన, ఒక కుట్రప్రకారం, కక్షపూరిత ధోరణితో తెలుగుదేశం ప్రభుత్వ నిర్ణయాలపై బురద జల్లాలన్నదే జగన్‌ తాపత్రయమని దేవినేని మండి పడ్డారు.

న్యాయస్థానాలు చెప్పినా వినకుండా లెక్కలేనితనంతో రివర్స్‌ టెండర్లకు వెళ్లిన జగన్‌,  అసలు ఉద్దేశం నిస్సందేహంగా పోలవరం పవర్‌ ప్రాజెక్ట్‌ని కొట్టేయడమేనన్నారు.