ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 25 అక్టోబరు 2018 (13:25 IST)

గుండెపోటా.. భయపడొద్దు.. ఇలా చేస్తే చాలు.. సేఫ్‌..

గుండెపోటు వచ్చిందా. అయితే ఏం భయపడాల్సిన అవసరం లేదు. నేరుగా తిరుపతి రుయా ఆసుపత్రికి గుండెపోటు వచ్చిన తర్వాత 4 గంటల లోపల చేరుకుంటే చాలు. సేఫ్. కేంద్రప్రభుత్వం అత్యాధునిక స్టెమికార్డియాక్ కేర్ యూనిట్‌ను తిరుపతికి మంజూరు చేసింది. ఈ యూనిట్‌తో గుండెపోటు వచ్చిన రోగులను క్షేమంగా కాపాడే అవకాశం ఉంటుందంటున్నారు వైద్యులు. 
 
రుయా. శ్రీ వేంకటేశ్వర రామ్ నారాయణన్ జనరల్ ఆసుపత్రి. తిరుపతిలోని  రుయా ఆసుపత్రి రాయలసీమ జిల్లాలలోని పేదల ఆసుపత్రిగా పేరు గాంచింది. ఈ ఆసుపత్రిలో అన్ని విభాగాలు రోగులకు సేవలు చేస్తుంటే కార్డియాలజీ విభాగం మాత్రం మూతపడింది. అయితే కార్డియాలజీ విభాగం కూడా అత్యవసరం అని గుర్తించిన వైద్యాధికారులు కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళారు. ఈ నేపథ్యంలో కేంద్రం అత్యాధునిక స్టెమి కార్డియాక్ కేర్ యూనిట్‌ను తిరుపతి రుయా ఆసుపత్రికి మంజూరు చేసింది. ఇండియాలో పది ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే, సౌత్ ఇండియాలో ఒకే ఒక ప్రాజెక్టు తిరుపతి రుయా ఆసుపత్రికి మంజూరైంది. తిరుపతి రుయా ఆసుపత్రితో పాటు ఈ ఆసుపత్రికి అనుబంధంగా జిల్లాలో ఉన్న తంబళ్ళపల్లి, కుప్పం, పలమనేరు, పుత్తూరు, శ్రీకాళహస్తి, సత్యవేడుతో పాటు మరో ఆరు కేంద్రాలలో సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. 
 
ఏరియా ఆసుపత్రిలో గుండెపోటుతో వచ్చిన రోగుల ఇసిజి తీసి ఆ సమాచారాన్ని తిరుపతి రుయా ఆసుపత్రిలోని వైద్యులకు పంపుతారు. వైద్యనిపుణుల సలహా మేరకు టెనిక్ టిక్ ప్లే ఇంజెక్షన్‌ను రోగికి వేస్తారు. ఈ ఇంజెక్షన్ విలువ 40 వేల రూపాయలు. ప్రభుత్వం ఉచితంగా రోగికి ఈ ఇంజెక్షన్ అందుబాటులోకి తెచ్చింది. ఈ యూనిట్ ఏర్పాటు కావడం వల్ల గుండెపోటు మరణాల సంఖ్యను తగ్గించవచ్చునంటున్నారు వైద్యులు. స్టెమి కార్డియాక్ కేర్ యూనిట్ తిరుపతి రుయాకు రావడం సంతోషంగా ఉందంటున్నారు సూపరింటెండెట్ సిద్థానాయక్. 
 
ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యం చేతిలో మోసపోకుండా, లక్షలకు లక్షలు వెచ్చించి చికిత్స చేయించుకోలేని నిరుపేద రోగులకు తిరుపతి రుయా ఆసుపత్రి వరప్రసాదినిగా మారనుంది. అందులోను గుండెపోటుకు అత్యాధునికమైన చికిత్సను ఉచితంగా కేంద్ర ప్రభుత్వం అందించనుండటంతో నిరుపేద రోగుల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయి. చిత్తూరు జిల్లాలోనే కాకుండా ఎపిలోని ప్రధాన ఆసుపత్రులలో కూడా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది కేంద్ర ప్రభుత్వం.