శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 30 జనవరి 2019 (15:28 IST)

ముంబైలో పరువు హత్య : చెల్లితో నిఖాకు సిద్ధమైన ప్రియుడ్ని చంపిన అన్నదమ్ములు

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో పరువు హత్య జరిగింది. తన చెల్లిని ప్రేమించినందుకు యువకుడుని ఇద్దరు అన్నదమ్ములు కలిసి అత్యంత దారుణంగా కొట్టి, కత్తితో పొడిచి చంపేశారు. తాజాగా జరిగిన ఈ పరువు హత్య వివరాలను పరిశీలిస్తే...
 
ముంబై నగరంలోని మలాద్ అనే ప్రాంతానికి చెందిన సైఫ్ షరాఫత్ అలీ (25) అనే యువకుడు తమ పక్కింట్లో నివశించే ఓ యువతిని ప్రేమలో పడ్డాడు. వీరిద్దరి మధ్య కొన్నేళ్లుగా కొనసాగుతూ వచ్చిన ఈ ప్రేమ వ్యవహారం యువతి అన్నకు తెలిసింది. దీంతో అలీని పలుమార్లు హెచ్చరించాడు. ఈ ప్రేమికులు ఒకే మతానికి చెందినవారైనప్పటికీ వీరి పెళ్లికి కుటుంబ పెద్దలు అంగీకరించలేదు. అయినప్పటికీ.. ఆ యువతిపై అమితమైన ప్రేమ పెట్టుకున్న అలీ.. ఆమెను పెళ్లి చేసుకోవాలని భావించాడు. 
 
ఇందుకోసం దీంతో ఇంటి నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకోవడానికి ఆ ప్రేమ జంట సిద్ధమైంది. మంగళవారం ఉదయం తన ప్రియురాలిని తీసుకుని వెళ్లి నిఖా చేసుకుందామని అలీ ఆ అమ్మాయి ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో లోపలికి వెళ్లి ఆమెను తీసుకెళ్లబోయాడు. అంతలోనే ఆమె అన్నదమ్ములు వసీమ్ ఖాన్ (19), అజ్మల్ (23) ఇంట్లోకి వచ్చారు. వారి ప్రేమ వ్యవహారం అసలే ఇష్టంలేని సోదరులిద్దరూ అలీని పట్టుకుని దారుణంగా కొట్టారు. 
 
వారిలో ఒకరు కత్తితో అలీని పొడిచాడు. ఆ తర్వాత అతడిని రోడ్డుపై పడేసి పరారయ్యారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అలీని ఇరుగుపొరుగువారు గుర్తించి హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా, అప్పటికే చనిపోయాడని వైద్యులు చెప్పారు. దీనిపై హత్య కేసు పెట్టిన పోలీసులు పరారీలో ఉన్న వసీం, అజ్మల్‌ను గాలించి పట్టుకున్నారు. వారిపై హత్య కేసు పెట్టినట్లు పోలీసుల చెప్పారు.