శుక్రవారం, 1 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: గురువారం, 6 జులై 2017 (22:11 IST)

మద్యం వ్యాపారం ప్రధాన ఆదాయ వనరు కాదు... ఎక్సైజ్ శాఖా మంత్రి జవహర్

అమరావతి : మద్యం దుకాణాలకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులున్నా.. ప్రజలు నేరుగా తనకు తెలియజేయవచ్చని.. అలాంటి ఫిర్యాదులను 24 గంటల్లో పరిష్కరిస్తామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖా మంత్రి కొత్తపల్లి శామ్యూల్ జవహర్ తెలిపారు. గురువారం సచివాలయంలోని పబ్లిసిటీ సెల్‌లో జరిగ

అమరావతి : మద్యం దుకాణాలకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులున్నా.. ప్రజలు నేరుగా తనకు తెలియజేయవచ్చని.. అలాంటి ఫిర్యాదులను 24 గంటల్లో పరిష్కరిస్తామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖా మంత్రి కొత్తపల్లి శామ్యూల్ జవహర్ తెలిపారు. గురువారం సచివాలయంలోని పబ్లిసిటీ సెల్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నివాస ప్రాంతాల్లో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకుంటున్నామని.. ఒకవేళ అలాంటి దుకాణాలుంటే.. వాటిని వెంటనే మార్చేయాలని సూచిస్తున్నామని మంత్రి తెలిపారు. 
 
ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో నివాస ప్రాంతాల మధ్య మద్యం దుకాణాలకు వ్యతిరేకంగా మహిళలు ఆందోళన చేస్తున్న అంశంపై మంత్రి స్పందిస్తూ.. ఇప్పటికే అలాంటి ఆందోళనలకు సంబంధించి తనకు 13 ఫిర్యాదులొచ్చాయని.. వాటిలో 11 ఫిర్యాదులను పరిష్కరించామని వివరించారు. నివాస ప్రాంతాల్లో మద్యం దుకాణాలపై ఎవరికైనా అభ్యంతరాలుంటే.. నేరుగా తనకు (9951314101) ఫిర్యాదు చేయొచ్చని.. అలాంటి ఫిర్యాదులపై 24 గంటల్లోగా చర్యలు తీసుకుంటామన్నారు. మద్యం పాలసీ అమలులో పూర్తి పారదర్శకతతో వ్యవహరిస్తున్నామని.. షాపుల కేటాయింపు కూడా నిష్పక్షపాతంగా నిర్వహించామని మంత్రి తెలిపారు. 
 
రాష్ట్ర వ్యాప్తంగా 4,367 మద్యం దుకాణాలకు గానూ.. ఇప్పటి వరకు 2,351 షాపులకు (53.84 శాతం) లైసెన్సులిచ్చామని.. అలాగే 830 బార్లకు గానూ 245 (29.52 శాతం) బార్లకు లైసెన్సులిచ్చామని పేర్కొన్నారు. మద్యం షాపులు, బార్ల ఏర్పాటు, నిర్వహణలో నిబంధనలు అతిక్రమణకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వ్యాపారులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని.. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 
 
ఎక్సైజ్ శాఖా మంత్రిగా తాను బాధ్యతలు స్వీకరించాక.. 6,324 బెల్ట్ షాపులపై కేసులు నమోదు చేశామన్నారు. నిబంధనలు అతిక్రమించి వ్యాపారం చేస్తున్న 2,901 మందిని అరెస్టు చేయడంతో పాటు, 106 వాహనాలను సీజ్ చేశామని తెలిపారు. ఎమ్మార్పీ కన్నా అధిక ధరలకు మద్యం అమ్మడం, బ్రాండ్ మిక్సింగ్‌కు పాల్పడటం వంటి అంశాలను సీరియస్ గా తీసుకుంటున్నామని.. ఇలాంటి కేసుల్లో కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారాయన. మద్యం వ్యాపారం రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా ప్రతిపక్షాలు పేర్కొనడాన్ని ఆయన ఖండించారు. టార్గెట్లు పెట్టి మద్యం వ్యాపారం చేస్తున్నామనడం కూడా అబద్దమన్నారు. అలాగే మద్యం షాపులకు దేవుడి పేర్లు పెట్టరాదని లైసెన్సుదారులకు మంత్రి విజ్ఞప్తి చేశారు.