శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: శనివారం, 2 జూన్ 2018 (19:23 IST)

నేను రెచ్చగొట్టాలి అనుకుంటే ఇలా వుండదు ముఖ్యమంత్రిగారూ... పవన్ కళ్యాణ్

2014 ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్నా, అయితే ఓట్లు చీలిపోతే రాష్ట్రానికి అన్యాయమై వైసీపి వస్తుందనీ, వాళ్లు వస్తే భూ కబ్జాలు, అవినీతి పెరిగిపోతాయని భయపడ్డాను అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పారు. అందుకే తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చాననీ, తీరా

2014 ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్నా, అయితే ఓట్లు చీలిపోతే రాష్ట్రానికి అన్యాయమై వైసీపి వస్తుందనీ, వాళ్లు వస్తే భూ కబ్జాలు, అవినీతి పెరిగిపోతాయని భయపడ్డాను అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పారు. అందుకే తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చాననీ, తీరా ఆ పార్టీ నాయకులు రాష్ట్రాన్ని దోచేయడంలో వైసీపీ వాళ్లని మించిపోయారని స్పష్టం చేశారు. సమర్థుడైన నాయకుడు ప్రధాని అవుతాడని భాజపా, నీతివంతమైన పాలన చేస్తామని టిడిపి వాళ్ల నా దగ్గరికి వచ్చి అడిగితేనే 2014లో మద్దతు ఇచ్చాను అన్నారు. 
 
ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం జిల్లా వెనుకబాటుతనం పోయి అభివృద్ధి చేస్తారని భావిస్తే తెలుగుదేశం ప్రభుత్వం ఇసుక మాఫియా, భూ కబ్జాల్లో మునిగిపోయిందని తప్పుపట్టారు. జనసేన పోరాట యాత్రలో భాగంగా పవన్ శనివారం నాడు చీపురుపల్లి నియోజకవర్గం కేంద్రంలో కవాతు నిర్వహించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ... ''ముఖ్యమంత్రి గారు ఈ రోజు నవ నిర్మాణ దీక్ష చేస్తూ పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర ప్రజలను రెచ్చగొడుతున్నాడని చెప్పారు. నాది రెచ్చగొట్టి, విడదీసే తత్వమా? నేను రెచ్చగొట్టాలి అనుకుంటే ఇలా వుండదు ముఖ్యమంత్రిగారూ తెలుసుకోండి. ఉత్తరాంధ్ర నా కుటుంబం. నా అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములు.. వీళ్లందరికీ అన్యాయం చేస్తుంటే చూస్తూ ఊరుకోను. 
 
నిరాదరణకి గురైన ఈ ప్రాంతం పక్షమే నేనుంటాను. వీరితో ఉండక అమరావతి పక్షం వుండమంటారా? తప్పు చేస్తే తప్పకుండా నిలదీస్తుంది జనసేన పార్టీ. ఉత్తరాంధ్రలో ఉపాధి లేక వలసలు పోతుంటే పట్టదు. ఈ ప్రాంత ప్రజలకి సరైన వైద్యం, మంచి విద్య అందించలేరు. తోటపల్లి ప్రాజెక్టుకి చివరన ఉన్న చీపురుపల్లి భూములకి ఇప్పటికీ నీళ్లు ఇవ్వలేకపోతున్నారు. కాలువలు కూడా పూర్తిచేయలేదు. వరద నీరు ఇచ్చి ఇవే తోటపల్లి ప్రాజెక్టు నీళ్లు అంటున్నారు. ఇక్కడ ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్లు లేరు. ఆపరేషనుకి మత్తు డాక్టర్లు వుండరు. బయట నుంచి పిలిచి రోగితో డబ్బులు కట్టిస్తున్నారు. ఇదేమి పద్ధతి. 
 
వలసలు వెళ్లిపోతున్నారని నాయకులకి చెబితే... మట్టి పిసుక్కుంటే ఏమి వస్తుందని చులకన చేస్తారా? ఈ మట్టి పౌరుషం మీకు తెలుసా? సమైక్యాంధ్ర ఉద్యమంలో విజయనగరం జిల్లా ప్రజలు పోరాడితే 14 రోజులు కర్ఫ్యూ పెట్టారు. అదీ వారి తెగువ. ఇక్కడి నాయకులు ఎప్పుడు టిడిపివారు అవుతారో, ఎప్పుడు వైసిపి వారు అవుతారో తెలియదు. అవసరమైతే వీళ్లు కాంగ్రెస్ పార్టీవారు కూడా అవుతారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలి. కానీ మీ అబ్బాయికి మంత్రి పదవి కట్టబెట్టి ఆయనకు ఉద్యోగం ఇవ్వగానే రాష్ట్రంలోని యువతకు వచ్చినట్లు కాదు ముఖ్యమంత్రిగారు. ఇక్కడ కాలుష్యకారక పరిశ్రమలు ఎక్కువున్నాయి. అందువల్ల కార్మికలకు జీవిత బీమా ఇవ్వాలి. 
 
ఈ ప్రభుత్వానికి ఎప్పుడూ పారిశ్రామికవేత్తల సంక్షేమం గురించే కానీ కార్మికుల సంక్షేమం పట్టదు. వీటన్నిటినీ జనసేన గుర్తించింది. 40 ఏళ్ల రాజకీయ అనుభవం వున్నదని ముఖ్యమంత్రి చెపుతుంటారు. వారి అనుభవం ఇసుక మాఫియాను పెంచి పోషించడానికి ఉపయోగపడింది. ఉచిత ఇసుక పేరుతో అవినీతికి చట్టబద్ధత ఇచ్చింది ఆ అనుభవం. పొలాల్లో ఇసుక మేటలు వేసిందనే పేరుతో మీ నాయకులే మొత్తం దోచేస్తున్నారు. జనసేన పార్టీ ప్రజల ఆకాంక్షలు, యువత ఆలోచనలు తెలుసుకున్న పార్టీ. ప్రతి సమస్యను అర్థం చేసుకునే పార్టీ. ఈ సమస్యలకు పరిష్కారం దొరికేవరకూ పోరాడుతుంది అని అన్నారు పవన్ కళ్యాణ్.